Telangana Police Department (Photo-PTI)

Hyderabad, June 12: కోవిడ్-19పై పోరులో కీలకపాత్ర పోషిస్తున్న పోలీసులను ( Police Department) మహమ్మారి వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా భారీన పడుతున్న పోలీసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పోలీసులు, వైద్య సిబ్బంది కరోనా కోరల్లో చిక్కుకుపోతున్నారు. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి పోలీసులు నిరుపమానమైన సేవలందించారు. వైరస్‌ (Covid 19 in Telangana) సోకిన వారిని గుర్తించి చికిత్సకు తరలించారు. ఆ సమయంలో అనుకోకుండానే వారు వైరస్ భారీన పడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కొత్తగా మరో 209 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 4,320కి చేరిన కరోనా బాధితుల సంఖ్య, 165కు పెరిగిన కోవిడ్ మరణాలు

బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో (banjarahills police station) మరో ఐదుగురు పోలీసులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారంరోజుల్లో పోలీస్‌స్టేషన్‌లో కరోనా బారిన పడినవారి సంఖ్య పదికి చేరుకుంది. బంజారాహిల్స్‌ పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు ఇటీవల కరోనా పాజిటివ్‌ రావడంతో మిగిలిన సిబ్బందికి మొత్తం పరీక్షలు చేస్తున్నారు. రోజుకు సుమారు 20 మందిని గోషామహల్‌తో పాటు ఇతర దవాఖానలకు పంపించి పరీక్షలు చేయిస్తున్నారు. దీంతో రెండురోజుల క్రితం చేసిన పరీక్షల్లో ఒక ఎస్సై, ఆరుగురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డుకు పాజిటివ్‌ రావడంతో వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు.

ఇక తన కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరైన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ (Siddipet collector) వెంకట్రామిరెడ్డి గురువారం సెల్ఫ్‌ హోంక్వారంటైన్‌లోకి వెళ్లారు. అక్కడి నుంచే ఆయన జిల్లా అభివృద్ధి పనులను పర్యవేక్షించనున్నారు. కొండపోచమ్మసాగర్‌ ముంపు గ్రామమైన పాములపర్తి,మరికొన్ని ఇతర గ్రామాల ప్రజలు ఇళ్ల నిర్మాణాల కోసం హెచ్‌ఎండీఏ అనుమతి పొందే విషయమై ఇటీవల కలెక్టర్‌ను కలిశారు. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో అతడిని హైదరాబాద్‌కు తరలించారు. దీంతో జిల్లా కలెక్టర్‌ ముందు జాగ్రత్త చర్యగా సెల్ఫ్‌ క్వారంటైన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

మన్సూరాబాద్‌లోని సహారా గేట్‌ వద్ద ప్రగతినగర్‌ కాలనీలో ఉండే ఓ ఎస్‌ఐకి కోవిడ్‌ సోకింది. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్, ఏఎస్‌ఐ వైరస్‌ బారిన పడ్డారు. వారు ఆస్పత్రిలో చేరగా తాజాగా మరో ఇద్దరు పోలీసు సిబ్బందికి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. క్రైమ్‌ విభాగంలో పనిచేసే ఓ ఎస్‌ఐతోపాటు కోర్టు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌కు కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స నిమిత్తం వారిని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి కోవిడ్‌ వార్డుకు తరలించారు.

డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు కొవిడ్‌ బారిన పడ్డారు. దీంతో.. ఆయన్ని గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. సన్నిహితంగా మెలిగిన వారిని క్వారంటైన్‌కు తరలించారు.ఇప్పటికే అక్కడ ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

పోలీసుశాఖలో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోలీసుశాఖ అప్రమత్తమైంది. కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న ఉన్నతాధికారులు, కిందిస్థాయి సిబ్బంది విశ్రాంతి తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల ఎస్పీలు/కమిషనర్లకు ఈ మేరకు అధికారికంగా ఆదేశాలు జారీచేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా పోలీసులు ఎనలేని సేవలందిస్తున్నారని, ఒకవేళ వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సెలవు తీసుకోవాలని సూచించా రు. ఉన్నతాధికారులు కూడా వెంటనే అనుమతివ్వాలని ఆదేశాల్లో స్పష్టంచేశారు.