Hyd, Sep 27: హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rainfall) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలతో పోలీసు శాఖ అప్రమత్తం అయింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ (CP Anjani Kumar) ఉన్నతాధికారులు, సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఎలాంటి సమస్య వచ్చినా డయల్ 100కి లేదా స్థానిక పోలీసులకు గానీ, పెట్రోలింగ్ సిబ్బందికి గానీ సమాచారం ఇవ్వాలన్నారు. నీరు నిలిచే ప్రాంతాలు, కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు.
గులాబీ తుఫాను పట్ల ప్రజలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర (Stephen Ravindra) అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయనే వాతావారణ శాఖ సూచనతో సైబరాబాద్ కమీషనరేట్‌లో సిబ్బందిని అలెర్ట్ చేశామని ఆయన తెలిపారు. 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు, సిబ్బందికి ఆదేశాలిచ్చామన్నారు. సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి సూచనల సైబరాబాద్‌లో ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.
తెలంగాణలో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. అన్నిశాఖలతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నామని సీపీ పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలు వస్తే కంట్రోల్ రూమ్ నెంబర్ 9490617100, 8331013206, 040-278534183, 040-27853412, టోల్‌ఫ్రీ నెంబర్ 1912 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసుల సహాయం కోసం డయల్ 100కు కాల్ చేయాలని స్టీఫెన్ రవీంద్ర కోరారు.
హైదరాబాద్‌లోని ప్రధాన రోడ్లపై వరద పొటెత్తింది. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. వర్షానికి వాహనదారుల ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలిచిపోకుండా స్థానికులు మ్యాన్‌హోల్స్ మూతలు తీశారు. వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాన్ దృష్ట్యా హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 040-23202813కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
మరో నాలుగైదు గంటలపాటు హైదరాబాద్‌లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసుల సూచిస్తున్నారు. బయట ఉన్నవారు వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరించారు. ఎక్కడికక్కడ యంత్రాంగాన్ని ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
మణికొండ నాలాలో పడిపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రజనీకాంత్ మృతదేహం లభ్యమైంది. శనివారం రాత్రి గోల్డెన్ టెంపుల్ వద్ద రజనీకాంత్ మ్యాన్ హోల్‌లో పడి గల్లంతైన విషయం తెలిసిందే. రెండు కి.మీ. దూరంలో నెక్నమ్‌పూర్ చెరువు ఒడ్డున ఆయన మృతదేహం సోమవారం లభ్యమైంది. జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, డ్రోన్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా రజనీకాంత్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో దొరికింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మణికొండ మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలా ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణలోని 14 జిల్లాల్లో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జోన్‌లో ఉన్నాయి. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు.