Hyderabad, March 17: మార్చి రెండోవారం నుంచే.. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు (Temperatures)పెరిగిపోతున్నాయి. రోజూ 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. మధ్యాహ్నం అయిందంటే చాలు.. రోడ్లపై జనసంచారం తగ్గిపోతోంది. అయితే.. ఇది శాంపిల్ మాత్రమేనని.. ముందు ముందు ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం, శుక్రవారం వడగాల్పులు వీచే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు (IMD) హెచ్చరించారు. ఈ రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert)జారీ చేసింది. సాధారణంగా మే నెలలో వడగాలులు వీస్తాయని కానీ ఈ సంవత్సరం మార్చిలోనే వీస్తుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది.
బుధవారం పెద్దపల్లి మంథనిలో ఏకంగా 42.9, నల్గొండలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.గత పదేళ్లలో నల్గొండ పట్టణంలో ఇంత అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి అంటున్నారు. ఇదేరకంగా ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలున్నందున ప్రజలు ఎండలో తిరగరాదని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఈ వేడికి గాలిలో తేమ అసాధరణ స్థాయిలో తగ్గి…పొడి వాతావరణం ఏర్పడి ఉక్కపోతలు అధికమయ్యాయని తెలిపారు.
గతేడాదితో పోలిస్తే ఈ సారి మార్చి రెండో వారంలోనే తెలుగు రాష్ట్రాల్లో 35 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర భారతలో వీస్తున్న వేడి గాలుల కారణంగా మార్చి రెండో వారంలోనే పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వచ్చే నెల, మే నెలల్లో వేడి గాలులతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు పెరుగుతున్నాయి. ఎండల ప్రభావంతో అడుగు బయటపెట్టాలంటేనే జనం వణికిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చిలోనే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఇంకెంత దారుణ పరిస్థితులు ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. క్రమేపీ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్నారు.