Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, తీహార్‌ జైల్లో కవితను విచారించనున్న సీబీఐ, ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు
BRS MLC Kavitha (Photo-ANI)

Hyd, April 6: ఢిల్లీ మద్యం విధానం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కోర్టు అనుమతి కోరింది. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తీహార్‌ జైలులో కవితను లిక్కర్‌ స్కాం కేసులో విచారించి, ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయాలని కోరుతూ పిటిషన్‌ వేసింది.

కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి రౌస్‌ అవెన్యూ కోర్టు అనుమతించింది. జైల్లోకి ల్యాప్‌టాప్‌, స్టేషనరీ తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది. లిక్కర్‌ కేసులో కవితను విచారించి, ఆమెస్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేయనుంది. వచ్చే వారం తీహార్‌ జైలులోనే కవితను దర్యాప్తు సంస్థ విచారించనుంది.

ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా కవిత తిహార్ జైలులో ఉన్నందున ఆమెను ప్రశ్నించే ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు విధించింది. అలాగే, విచారణలో అన్ని నిబంధనలు పాటించాలని సూచించింది. ఈ కేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని కవిత నివాసంలోనే సీబీఐ అధికారులు ఆమెను మూడు రోజుల పాటు విచారించిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు, కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 4కు వాయిదా పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఈడీకి నోటీసులు

ఆప్‌కు ఇచ్చిన రూ. 100 కోట్ల వ్యవహారంపై ప్రశ్నించనుంది. అయితే గతంలోనే తమ ఎదుట హాజరుకావాలని కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. లిక్కర్‌ కేసులో విచారణకు హాజరుకావాలంటూ 2022 డిసెంబర్‌ 2న కవితకు నోటీసులు పంపింది. ఇప్పటికే లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ అయిన కవిత.. ప్రస్తుతం తీహార్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. గత నెల(మార్చి 15న) కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మార్చి 16న ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పరచగా ఏడు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో మూడు రోజుల కస్టడీ విధించింది. అనంతరం మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పర్చగా క​వితకు ఏప్రిల్‌ 9వ తేదీ వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది.