![](https://test1.latestly.com/wp-content/uploads/2020/03/Drunk-and-Drive-380x214.jpg)
Hyderabad, March 13: డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk & Drive) పరీక్షల్లో భాగంగా నిర్వహించే 'బ్రీత్ అనలైజర్' (Breathalyser) టెస్టులు యధావిధిగా కొనసాగుతాయని హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) స్పష్టం చేస్తున్నారు. దేశంలో కరోనావైరస్ అంటువ్యాధి విజృంభిస్తున్న (Coronavirus Scare) నేపథ్యంలో ఈ బ్రీత్ అనలైజర్ పరీక్షల పట్ల నగర ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
జీరో అవర్ ప్రశ్నోత్తరాల సమయంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇదే విషయాన్ని లేవనెత్తారు. ప్రజల్లో కరోనావైరస్ వ్యాప్తి భయాలు ఉన్న నేపథ్యంలో బ్రీత్ అనలైజర్ పరీక్షలను ఒక నెలపాటు నిలిపి వేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించేటపుడు ఒకే స్ట్రాను అందరికీ ఉపయోగిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీనివల్ల తమకు వైరస్ సోకుతుందేమోనన్న భయాందోళనలు వాహనదారుల్లో ఉన్నాయని, కాబట్టి కొన్నాళ్ల పాటు ఈ పరీక్షలు నిలిపివేయాలని కోరారు. దీనిపై స్పందించిన హోంమత్రి మహమూద్ అలీ ఈ అంశంపై పోలీసులతో చర్చిస్తామన్నారు. భారత్‌లో 75కు పెరిగిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు
ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ కమీషనర్ అనిల్ కుమార్ కమీషనర్ స్పందించారు. కోవిడ్ 19 వ్యాప్తి- బ్రీత్ అనలైజర్ టెస్టుల విషయంలో తాము ఇదివరకే అంతర్గతంగా చర్చించినట్లు పేర్కొన్నారు. తాము నిర్వహించే బ్రీత్ అనలైజర్ వ్యవస్థ చాలా సురక్షితమైన, పరిశుభ్రమైన పరిస్థితులలో చేపడతాము. కాబట్టి ప్రజలు దీనిపై ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. పోలీసులు ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ప్రతీ వాహనదారుడికి వేరువేరుగా కొత్త డిస్పోజేబుల్ స్ట్రాను వినియోగిస్తున్నాము. రోడ్డు ప్రమాదాలను నివారించడం మా ప్రథమ కర్తవ్యం కాబట్టి బ్రీత్ అనలైజర్ పరీక్షలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.