Hyderabad, Oct 19: భాగ్య నగరంలో టపాసులు పేల్చడంపై ఆంక్షలు వచ్చేశాయి. కాలుష్యకారక పటాకుల విక్రయాలపై నిషేధం విధిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ (GHMC Commissioner Lokesh Kumar) ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన మార్గదర్శకాలను నగరంలో అమలు చేయాలని నిర్ణయించారు. తక్కువ శబ్దం, నామమాత్రపు కాలుష్యకారక పటాకుల వినియోగంతో ( banning sale of polluting firecrackers) గాలి కాలుష్యాన్ని 15-20 శాతం తగ్గించాలనే లక్ష్యంతో పలు మార్గదర్శకాలు జారీ చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.
పర్యావరణహిత దీపావళి పండుగను ప్రోత్సహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రభుత్వ శాఖలు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో నగర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి నిషేధిత పటాకులు విక్రయించే దుకాణాల సమాచారాన్ని పౌరులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఇవ్వాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
నగరంలో గ్రీన్ పటాకులను ప్రోత్సహిస్తూ చర్యలు తీసుకుంటున్నామని, జోన్లు, సర్కిళ్ల వారీగా పటాకుల విక్రయ కేంద్రాలకు అనుమతులు జారీ చేస్తున్నామని వెల్లడించారు. పటాకుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలకున్న వారు సంబంధిత సర్కిల్ కార్యాలయంలో ఏఎంఓహెచ్ లేదా శానిటరీ సూపర్‌వైజర్లను సంప్రదించాలని సూచించారు.
ఈ మార్గదర్శకాలు తప్పనిసరి
- . విక్రయ కేంద్రాల ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ ఆఫీసుల్లోని పౌర సేవా కేంద్రాల్లో దరఖాస్తు సమర్పించాలి.
- సంబంధిత నిర్వాహకుల వివరాలను గేమ్ ఇన్‌స్పెక్టర్, సహాయ వైద్యాధికారి పరిశీలిస్తారు. అన్ని బాగుంటేనే జోనల్ కమిషనర్ అనుమతి మంజూరు చేస్తారు. ఇందుకు జీహెచ్‌ఎంసీ తాత్కాలిక కమర్షియల్ సర్టిఫికెట్‌ను జారీ చేస్తున్నది.
- నిర్వాహకులు రోజుకు ఒక్కో దుకాణానికి రూ.7,600 చొప్పున ఫీజు చెల్లించాలి. ఫీజును ‘కమిషనర్ జీహెచ్‌ఎంసీ’ పేరుతో డీడీ తీసి చెల్లించాలి.
- దుకాణాల ఏర్పాటుకు ఈ నెల 27వ తేదీ వరకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.
- ఒక్కో దుకాణాన్ని 15 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసుకోవాలి.
- గ్రేటర్‌లోని అన్ని మైదానాల్లో జీహెచ్‌ఎంసీ క్రీడల విభాగం ఏర్పాట్లు చేస్తున్నది.
- పౌరులు ఒక సమూహంగా ఏర్పడి.. సామూహికంగా పండుగ జరుపుకోవాలి. రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య టపాకులను కాల్చాలి.
- దుకాణాల వద్ద తోపులాటలు, రద్దీ నియంత్రణకు పోలీస్‌శాఖ, ఫైర్ సేఫ్టీ విభాగం అధికారులతో సమన్వయం తప్పనిసరి.
- దుకాణాల్లో పీఈఎస్‌ఓ(పెట్రోలియం, ఎక్స్‌ప్లోజివ్స్, సేఫ్టీ ఆర్గనైజేషన్) నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
- నిషేధిత రసాయనాలతో, పేలుడు పదార్థాలతో తయారైన టపాకులు, బూడిదలాంటి పేలుడు పదార్థాలను ఉపయోగించిన టపాకులు, ఎక్కువ ధూళి కణాలను వెదజల్లే టపాకులను విక్రయించరాదు.
- ఫ్లిప్‌కార్ట్, ఈ-కామర్స్, అమెజాన్ తదితర వెబ్‌సైట్లు టపాకుల విక్రయం జరుపవద్దు.
రసాయనాలతో తయారైన టపాకులపై నిషేధం. టపాకులను విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని, నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని అధికారులు ఈ సందర్బంగా హెచ్చరించారు.