Kamareddy, Nov 4: దీపావళి సంబరాలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. దీపావళి సెబ్రేషన్ (Diwali shopping) కోసం టపాసులు కొనేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో (Road Accident in TS) కుటుంబంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డికి చెందిన శ్రీనివాస్ ( 52) పండుగకు కూతురు, అల్లుడు ఇంటికి రావడంతో దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని అనుకున్నాడు.
దీంతో పటాకులు, దీపాలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేసేందుకు బుధవారం కారులో కామారెడ్డి వెళ్లాడు. తనతో పాటు అల్లుడు ఆనంద్ కుమార్ (31), సోదరుడు జగన్ (45 )తో పాటు మరో ఐదుగురు కుటుంబసభ్యులను తీసుకెళ్లాడు. షాపింగ్ పూర్తి చేసుకుని సాయంత్రం సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. అయితే అప్పటికే భారీ వర్షం కురుస్తుండటంతో ఎర్రపహాడ్ సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టును (Kamareddy Road Accident) ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్, అతని అల్లుడు ఆనంద్, సోదరుడు జగన్‌తో పాటు ఐదేళ్ల మనుమడు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారులో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇది గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు . క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పండుగ పూట ఒకేసారి నలుగుర్ని కోల్పోవడంతో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.