Chennai, Nov 7: తెలంగాణలో (Telangana) గొప్పలు చెప్పేందుకు వీలుకాక, తమిళనాడు (Tamilnadu)ను విమర్శిస్తున్నారంటూ తమిళిసై (Tamilisai)ని ఉద్దేశించి డీఎంకే (DMK) అధికార పత్రిక ‘మురసోలి’ (Murasoli)లో ప్రచురితమైన వ్యాసంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రస్థాయిలో స్పందించారు. తెలుగు మూలాలు ఉండి, ఇంట్లో ఆ భాష మాట్లాడుతూ బయట తమిళవేషం వేసేవారు, తనలా నిజమైన తమిళ రక్తం ప్రవహించే వారి వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీఎంకే తనను అగ్నిపర్వతం అని చెప్పుకుంటోందని, కానీ అది హిమాలయాలను ఏమీ చేయలేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఏం చూసినా భయపడేవారే గవర్నర్లను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. సీరియళ్లు, సినిమాల్లో నటించి పదవుల్లోకి వచ్చిన వారికి మాత్రమే కెమెరా, మైక్ మేనియాలు ఉంటాయని విమర్శించారు. నిజాలు మాట్లాడే తమకు ఉండవని తమిళిసై పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్నదేంటో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. తనను విమర్శించడానికి ముందు తెలంగాణ పత్రికల్లో వచ్చే వార్తలు చూస్తే ఎవరు వణుకుతున్నారో అర్థమవుతుందని అన్నారు. తమిళనాడులో వారసత్వ రాజకీయ ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలదీస్తున్నందునే గవర్నర్ రవిపై అధికార పార్టీ నేతలకు కోపమని తమిళిసై పేర్కొన్నారు.