Dr Reddy's Shuts Down Offices: డాక్టర్‌ రెడ్డీస్‌ లాబోరేటరీస్‌పై సైబర్‌ అటాక్, ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాల నిలిపివేత, ఔషధ తయారీ సంస్థలను లక్ష్యంగా చేసుకున్న హ్యాకర్లు
Dr. Reddy's Laboratories (Photo-PTI)

HYD, Oct 24: హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ లాబోరేటరీస్‌పై రెండు రోజుల క్రితం సైబర్‌ దాడి జరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను ఆ సంస్థ (Dr Reddy's Shuts Down Offices) నిలిపివేసింది. డేటా చోరీ యత్నాన్ని గుర్తించామని, అవసరమైన నివారణ చర్యల కోసం అన్ని డేటా సెంటర్లను వేరు చేసినట్లు రెడ్డీస్ పేర్కొంది. డాక్టర్ రెడ్డీస్‌ లాబొరేటరీస్ లిమిటెడ్‌ సీఐఓ ముఖేష్ రతి ఈ విషయాన్ని ధృవీకరించారు. అన్ని సేవలు 24 గంటల్లోపు తిరిగి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ సైబర్‌ దాడి తమ కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం చూపబోదని అన్నారు. ఇప్పటికే ఈ విషయమై కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్న తరుణంలో ఔషధ తయారీ సంస్థలను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. వ్యాక్సిన్‌కు సంబంధించిన డేటా చోరీ కోసం ప్రయత్నిస్తున్నారు. స్పుత్నిక్ వి పేరుతో కరోనా వ్యాక్సిన్‌ను రష్యా గత నెలలో అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్‌పై భారత్‌లో ట్రయల్స్‌ నిర్వహించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌తో ఒప్పందం కుదిరింది. అయితే రష్యా టీకా సామర్థ్యంపై తొలుత అనుమానాలు వ్యక్తం కావడంతో డ్రగ్స్‌ నియంత్రణ సంస్థ దీనికి అనుమతి నిరాకరించింది. సంబంధిత సమాచారం అందిన నేపథ్యంలో స్పుత్నిక్ వి 2,3 దశల ట్రయల్స్‌ కోసం డాక్టర్‌ రెడ్డీస్‌కు ఇటీవల అనుమతి ఇచ్చింది

కరోనా వ్యాక్సిన్ అందరికీ ఉచితంగా వేస్తాం, వెల్లడించిన తమిళనాడు ప్రభుత్వం, ప్రయోజనం ఇవ్వని ప్లాస్మా థెరపీ, ఢిల్లీలో మళ్లీ పెరుగుతున్న కేసులు, దేశంలో 78 లక్షలకు చేరుకున్న కోవిడ్ కేసులు

ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఐటీ నెట్‌వర్క్‌ వ్యవస్థపై సైబర్‌ దాడి జరుగడం ప్రాధాన్యత సంతరించుకున్నది. సైబర్‌ దాడి కారణంగా డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు గురువారం 3 శాతం మేర పతనమయ్యాయి.అమెరికా ( America ), లండన్ ( London ), బ్రెజిల్ ( Brazil ) , రష్యా, ( Russia ) ఇండియా ( India ) ల్లో కంపెనీ తన ఉత్పత్తుల్ని నిలిపివేసింది. సైబర్ దాడి జరిగిందనే విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ కు కూడా తెలిపింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఓ వైపు కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) ను అభివృద్ధికి ప్రయత్నిస్తూనే మరోవైపు రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ఉత్పత్తి, పంపిణీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ఇప్పటికే డీసీజీఐ అనుమతి కూడా తీసుకుంది.

రష్యా అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ( Russia vaccine sputnik v ) ట్రయల్స్ త్వరలో ఇండియాలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే డీసీజీఐ అనుమతి పొందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ..వందమందిపై పరీక్షలు చేయనుంది. భారత్ బయోటెక్ ( Bharat Biotech ) కంపెనీ స్వయంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తుండగా మరో రెండు కంపెనీలు విదేశీ వ్యాక్సిన్ ఉత్పత్రి, సరఫరా ఒప్పందాన్ని చేసుకున్నాయి. అంతేకాకుండా ఆ రెండు విదేశీ వ్యాక్సిన్ ట్రయల్స్ ( Vaccine Trials ) ను ఇండియాలో నిర్వహిస్తున్నాయి.

ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా ( Oxford - AstraZeneca ) సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ ఒప్పందం కుదుర్చుకున్న ప్రముఖ వ్యాక్సిన్ కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum Institute ).. ట్రయల్స్ కూడా ప్రారంభించింది. తరువాత రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తో ఇండియాకు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ( Dr Reddy's Labs ) ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ స్పుత్నిక్ వ్యాక్సిన్ ట్రయల్స్ ను త్వరలో ఇండియాలో ప్రారంభించనుంది. ఇప్పటికే దీనికోసం డీసీజీఐ ( DCGI ) అనుమతి తీసుకుంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వందమంది వాలంటీర్లపై ఈ ప్రయోగాలు చేయనుంది. ఈ పరీక్షలు ఎప్పుడు చేసేది ఇంకా నిర్ణయించలేదు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం చేసుకుంది.

ఒప్పందంలో భాగంగా ప్రయోగాల అనంతరం 10 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను తయారుచేయడానికి రెడ్డీస్‌ ల్యాబ్‌కి అనుమతిచ్చినట్లు ఆర్‌డీఐఎఫ్‌ వెల్లడించింది. గత నెలలో ఆర్‌డీఐఎఫ్‌ భారత ప్రభుత్వంతోనూ, ఔషధ కంపెనీలతో స్థానికంగా స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ తయారీపై చర్చించింది. అలాగే స్పుత్నిక్‌–వీ భద్రత, దాని పనితీరుపై మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలను ది లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌ లో ప్రచురించారు. రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కి 100 మందిపై, మూడో దశలో 14 వందల వాలంటీర్లపై ప్రయోగాలు జరుపుతారని అధికారులు వెల్లడించారు.