Hyderabad, January 22: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ( Telangana Civic Polls 2020) దృష్ట్యా, పోలింగ్ పూర్తయ్యే వరకు రాష్ట్రంలో ఈరోజు 'డ్రై డే' (Dry Day) ప్రకటించారు. తెలంగాణ అంతటా మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే బల్క్ సందేశాలు, గ్రూప్ మెసేజులపై కూడా అధికారులు ఆంక్షలు విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో 120 మునిసిపాలిటీలు మరియు తొమ్మిది మునిసిపల్ కార్పొరేషన్లలోని 2,972 వార్డులలో పోలింగ్ జరుగుతుంది. ఫలితాల వెల్లడించే జనవరి 25న కూడా మద్యంపై విధించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
అయితే, అధికారులు ఎంత హెచ్చరించినా, ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్నా కొన్ని చోట్ల నేతలు ఓటర్లను భారీ ఆఫర్స్ ప్రకటిస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు నేతలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సిటీకి దగ్గరగా ఉండే ఒక్కోవార్డులో రూ. 3 కోట్లకు పైగానే అభ్యర్థులు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ శివారులోని బడంగ్ పేటలో 1700 ఓట్లు మాత్రమే ఉన్న వార్డులో ఓ అభ్యర్థి రూ. 3 కోట్లు ఖర్చు చేయగా, దాని చుట్టుపక్కల వార్డులో అభ్యర్థుల ఖర్చులు కోటి దాటాయి.
హుజూర్‌నగర్ లో 5 ఓట్లున్న ఇంటికి తులం బంగారం పంచినట్లు తెలిసింది, మరికొన్ని చోట్ల బంగారు ముక్కుపుడకలు, వెండి నాణేలు, బహుమతులు విందులు, ఊటీ- కొడైకెనాల్ విహార యాత్రల ఆఫర్లు ప్రకటిస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం కనిపిస్తుంది.
ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 2,972 మంది అభ్యర్థులను నిలబెట్టింది, కాంగ్రెస్ 2,616 అభ్యర్థులను, బిజెపి 2,313 మంది అభ్యర్థులను ప్రతిపాదించాయి. టీడిపి 347 వార్డులలో అభ్యర్థులను ప్రకటించగా, AIMIM 276 వార్డులలో పోటీ చేస్తోంది. సిపిఐ, సిపిఎంల నుంచి వరుసగా 177, 166 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక స్వతంత్రులతో కలిపి మొత్తంగా 12,898 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 80కి పైగా వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక కరీనంగర్ కార్పోరేషన్ కు ఈనెల 24న పోలింగ్ జరుగుతుంది. 27న ఫలితాల వెల్లడి ఉంటుంది.