Hyd, Nov 16: తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు (MLC Elections in Telangana) నోటిఫికేషన్ వెలువడింది. నేటి నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 24న ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 26. డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 1, వరంగల్ 1, నల్లగొండ 1, మెదక్ 1, నిజామాబాద్ 1, ఖమ్మం 1, కరీంనగర్ 2, మహబూబ్‌నగర్ 2, రంగారెడ్డి జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ 12 స్థానాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీల పదవీకాలం 2022 జనవరి 4తో ముగియనున్నది. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్‌ఎస్ పార్టీ (TRS Party) ఖరారు చేసింది.
గులాబీ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్ ఈ పోటీలో నిలవనున్నారు. కాగా, ఈరోజు నామినేషన్ దాఖలు ప్రక్రియ ఉండటంతో అసెంబ్లీలో సందడి వాతావరణం నెలకొంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లతో హడావుడి కనిపించింది. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ అభ్యర్ధులందరూ కూడా అసెంబ్లీ సెక్రెటరీ ఛాంబర్ దగ్గరికి చేరుకుంటున్నారు.
ఇక సిద్దిపేట కలెక్టర్‌గా సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిద్దిపేట కలెక్టర్‌గా ఎం హనుమంతరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌కు కలెక్టరేట్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా చేసిన వెంటనే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు.