ByElection for Nizamabad: నిజామాబాద్ స్థానానికి ఉపఎన్నిక, షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల కమీషన్, అనర్హత వేటు పడటంతో ఖాళీ అయిన స్థానం
Polling - Representational Image. | Photo: Pixabay

Hyderabad, March 5:  తెలంగాణలో (Telangana) ఖాళీగా ఉన్న నిజామాబాద్ ఎమ్మెల్సీ (Nizamabad MLC)  స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమీషన్ గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల ఏప్రిల్ 7వ తేదీన దీనికి పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 13లోపు ఈ ఉపఎన్నిక ప్రక్రియను పూర్తి చేయనుంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆర్ భూపతి రెడ్డిపై అనర్హత వేటు పడటంతో గతేడాది ఈ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికి బైఎలక్షన్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది.

షెడ్యూల్ ప్రకారం మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. అభ్యర్థులు నామినేషన్స్ వేసేందుకు చివరి తేది మార్చి 19, నామినేషన్ల పరిశీలన మార్చి 20, నామినేషన్లకు ఉపసంహరణ గడువు మార్చి 23, ఏప్రిల్ 07వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, ఏప్రిల్ 9న ఫలితాల వెల్లడి.  మార్చి 06 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం కింద టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ఆర్. భూపతి రెడ్డి, ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జారీ చేశారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం భూపతిరెడ్డిపై అనర్హత వేటు వేసింది. భూపతిరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాల్సిందిగా మండలి ఛైర్మన్ ను కోరింది. మండలి చైర్మన్ టీఆర్ఎస్ అభ్యర్థననను ఆమోదించడంతో గతేడాది జనవరి నెలలో భూపతిరెడ్డి మండలి అభ్యర్థిత్వాన్ని కోల్పోయారు.

అయితే తన ఎమ్మెల్సీ రద్దును సవాల్ చేస్తూ భూపతిరెడ్డి గతేడాది జూలై నెలలో హైకోర్టును ఆశ్రయించారు. తాను టీఆర్ఎస్ పార్టీగా పోటీ చేసినప్పటికీ, ఏకగ్రీవంగా ఎన్నికైనందున మండలి చైర్మన్ తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడం చెల్లదని ఆయన కోర్టుకు వివరించారు. అయితే హైకోర్ట్ భూపతిరెడ్డి వాదనలను తోసిపుచ్చింది. మండలి చైర్మన్ నిర్ణయమే అంతిమం అని, అనర్హత వేటు సరైనదే అని అతడి పిటిషన్ ను కొట్టివేసింది. హైకోర్ట్ తీర్పును భూపతి రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అక్కడా ఆయనకు చుక్కెదురైంది, సుప్రీంకోర్ట్ కూడా హైకోర్ట్ తీర్పును సమర్థించింది.

ఎమ్మెల్సీ పదవిని కోల్పోయిన భూపతిరెడ్డి, న్యాయస్థానాల్లోనూ ఎదురుదెబ్బ తినడంతో రెండు చోట్ల చేతులు కాల్చుకున్నట్లయింది. ఇక కోర్ట్ క్లియరెన్సులు లభించడంతో ఎన్నికల సంఘం బైఎలక్షన్ కు షెడ్యూల్ ప్రకటించింది.