Karimnagar, November 19: పెట్రోల్ బాటిల్ తో ఎవరైనా వస్తే రెవెన్యూ కార్యాలయ సిబ్బంది హడలిపోతున్నారు. ఇటీవల తహసీల్దార్ విజయారెడ్డి (Tehsildar Vijaya Reddy) ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవక ముందే తిరిగి అదే తరహాలో ఓ రైతు పెట్రోల్ సీసాతో రెవెన్యూ కార్యాలయానికి వచ్చి హల్‌చల్ చేశాడు.
వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ జిల్లాలోని లంబాడిపల్లి (Lambadipalli) గ్రామానికి చెందిన కనకయ్య (Kanakaiah) అనే రైతు తన భూమి పట్టాకు సంబంధించిన పాస్ పుస్తకం ఇవ్వకుండా తహసీల్దార్ విసుగిస్తున్నాడని కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం చిగురుమామిడి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి ( Chigurumamidi Tehsildar Office) వచ్చి సిబ్బందితో వాగ్వివాదానికి దిగాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ సీసాను తెరిచి కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ రామచంద్రంపై మరియు పక్కనే ఉన్న కంప్యూటర్లపై పెట్రోల్ చల్లి అగ్గిపుల్ల వెలిగించబోయాడు. వెంటనే తేరుకున్న అక్కడి సిబ్బంది కనకయ్యను బయటకు తోసేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు కనకయ్యను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఇన్సిడెంట్‌తో చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతు పెట్రోల్ సీసాతో రావడాన్ని చూసే సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అతడి వ్యవహారశైలిపై ముందుగానే అనుమానపడ్డారు, చివరికి దానినే నిజం చేస్తూ రైతు కనకయ్య దాడికి దిగడంతో భయంతో ఓ మూలన నిల్చున్నారు. సిబ్బంది అప్రమత్తంతో మరో ప్రమాదం తప్పినట్లయింది.
కనకయ్య భూవ్యవహారంలో అతడి సోదరిడి వైపు నుంచి వివాదం ఉన్న నేపథ్యంలోనే పాస్ పుస్తకం మంజూరు చేయడంలో జాప్యం జరుగుతుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన విషయం జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ దృష్టికి రావడంతో, ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెట్రోల్ చల్లిన రైతుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.