Hyderabad, September 30: హుజూర్ నగర్ (Huzur Nagar) ఉపఎన్నిక పోరు రసవత్తరం కానుంది, సోమవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు దాదాపు 80 మందివరకు స్వతంత్ర అభ్యర్థులు పోటీపడుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి సైదిరెడ్డి (Sanampudi Saidireddy), కాంగ్రెస్ తరఫున పద్మా ఉత్తమ్ రెడ్డి (Nalamada Padmavathi Reddy), బీజేపీ తరఫున కోటా రామారావు, సీపీఎం తరఫున పారేపల్లి శేఖర్ రావు, టీడీపీ తరఫున చావా కిరణ్మయి మరియు 'తీన్మార్' మల్లన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వీరితో తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేసేందుకు సర్పంచుల సంఘం నుంచి పలువురు, అలాగే కొంత మంది కాకతీయ యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు మరియు ఒక 85 ఏళ్ల వృద్ధురాలు కూడా నామినేషన్ వేసినట్లు సమాచారం.
మంగళవారం అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 03 వరకు గడువు ఇచ్చారు. అక్టోబర్ 21న ఈ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది, అక్టోబర్ 24న ఫలితాల విడుదల.
ప్రధాన పోటీ టీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్యే
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచి ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో హుజూర్ నగర్ లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇది కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానం కావడంతో, ఎలాగైనా ఈ స్థానంలో గెలిచి పట్టునిలుపుకోవాలని చూస్తుండగా, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, ఎలాగైనా ఈ స్థానంలో భారీ మెజార్టీతో గెలిచి, ప్రజల్లో తమ ప్రభుత్వం పట్ల ఎలాంటి వ్యతిరేకత లేదని నిరూపించుకునేందుకు పట్టుదలగా ప్రయత్నిస్తుంది. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో అనుకున్నన్ని స్థానాలు రాకపోవడంతో, ఈ ఉపఎన్నికను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. హుజూర్ నగర్ స్థానంపై దండయాత్ర ప్రారంభించిందా అన్నట్లుగా, ఇప్పటికే అధికార పార్టీకి చెందిన దాదాపు 70 మంది ముఖ్యనేతలకు సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ బాధ్యతలను అప్పగించినట్లుగా చెప్తున్నారు. ఈ పోటీకి సీపీఐ దూరంగా ఉండటంతో వారి మద్ధతు కూడగట్టేందుకు టీఆర్ఎస్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
ఇటు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి కావడంతో ఆయన కూడా కాంగ్రెస్ గెలుపును ప్రెస్టీజియస్‌గా తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించే వారిని ఏకం చేస్తున్నారు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్)కి 92,996 ఓట్లు పోలవగా, సైదిరెడ్డి (టీఆర్ఎస్)కి 85,530 ఓట్లు పోలయ్యాయి, మూడోస్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థికి 4,944 ఓట్లు పోలయ్యాయి. ఇక మిగతా పార్టీలకు పోలైన ఓట్లు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
దీనిని బట్టి ఈసారి కూడా కాంగ్రెస్ - టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తుంది. కాగా, తెలంగాణలో ఘోరపరాజయాన్ని చవిచూసిన టీడీపీ మరోసారి తమ ఉనికిని పరీక్షించుకునేందుకు చివరి సమయంలో అభ్యర్థిని నిలబెట్టి రేసులో నిలిచింది. మోదీ హవాతో తెలంగాణలో 4 ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ, ఆ హవా ఈ ఉపఎన్నికలోనూ కొనసాగుతుందని ఆశలు పెట్టుకుంది.
స్వతంత్ర అభ్యర్థిగా 'తీన్మార్' మల్లన్న
గత కొంతకాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మరియు సీఎం కేసీఆర్ విధానాలను వ్యతిరేకిస్తూ యూట్యూబ్ వీడియోల ద్వారా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న జర్నలిస్ట్ 'తీన్మార్' మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ ప్రజలు తనకు ఓ అవకాశం ఇవ్వాలంటూ హుజూర్ నగర్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
స్వతంత్ర అభ్యర్థిగా 85 ఏళ్ల వృద్ధురాలు
తన భూమికి సంబంధించిన పట్టా ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని నిరసన వ్యక్తం చేస్తూ హుజూర్ నగర్ స్థానికురాలైన లక్ష్మీ నర్సమ్మ అనే 85 ఏళ్ల వృద్ధురాలు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇదే కారణంతో మరికొంత మంది కూడా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది.