Srisailam, August 21: శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం అగ్ని ప్రమాదంలో (Srisailam Power Station Fire Accident) ఒకరు మృతి చెందారు. తొమ్మిది మందిలో ఒకరి మృత దేహాన్ని రెస్కూ టీం గుర్తించింది. మృతి చెందిన వారిని ఏఈ సుందర్ నాయక్ (35) గా గుర్తించారు. మిగతా 8 మంది కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో రెండు గంటలపాటు ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా, మృతుడు సుందర్ నాయక్‌ది సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం, జగన తండాగా తెలిసింది.అతనికి భార్య ప్రమీల ఇద్దరు కూతుళ్లు మనస్వి, నిహస్వి ఉన్నారు. నెల రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సుందర్ నాయక్ సొంతూరుకు వచ్చి 15 రోజులు హోమ్ క్వారెంటైన్‌లో ఉండి కరోనాను జయించారు. నిన్న రాత్రి 9 గంటలకు శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విధులకు హాజరయ్యారు. అతని తండ్రి నాగేశ్వరరావు కోపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో (Telangana Srisailam Power Plant) షాట్ సర్క్యూట్ కారణంగా గురువారం రాత్రి 10.30 గంటలకు భారీ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ప్రమాద సమయంలో 17 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. వారిలో 8 మంది సొరంగం నుంచి క్షేమంగా బయటపడ్డారు. మిగిలిన తొమ్మిదిమంది సిబ్బంది విద్యుత్ కేంద్రంలోనే చిక్కుకుపోయారు. దీంతో అధికారులు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. వీరి ఫోన్లు గంటపాటు పని చేసినా తరువాత స్పందించకపోవడంతో సిబ్బంది కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.