
Hyd, July 29; తెలంగాణలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం (Palamuru-Rangareddy Lift Irrigation Scheme) పనులు చేస్తున్న ఐదుగురు కూలీలు ప్రమాదవశాత్తు ఈ ఉదయం మృతి (Five workers found dead) చెందారు. నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం రేగుమనగడ్డ వద్ద ఈ తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి ప్యాకేజీ-1లో పనులు చేస్తున్న కూలీలు పంప్‌హౌస్‌లోకి దిగుతున్న సమయంలో క్రేన్ వైరు ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో కూలీలు కిందపడి దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితులను బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. మృదదేహాలను హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. కాగా, భార్యభర్తలిద్దరు మాగ్నా నదిలో కొట్టుకుపోయి మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. బషీరాబాద్మండల పరిధిలోని మంతటి గ్రామానికి చెందిన సిద్ధప్ప దంపతులు కూరగాయలు అమ్మేందుకు కాగ్నా నది అటువైపు ఉన్న చంద్ర కొంచెం గ్రామానికి వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో వరద ఉధృతికి కాగ్నా నదిలో కొట్టుకుపోయారు. కర్నాటక రాష్ట్రం జెట్టూరు గ్రామం వద్ద వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. సిద్ధప్ప దంపతుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.