GHMC Election Polling Over: దారుణంగా పడిపోయిన పోలింగ్ శాతం, ముగిసిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్, డిసెంబర్ 3న ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో రీపోలింగ్, డిసెంబర్ 4న ఫలితాలు
Andhra Pradesh local Body Elections 2020 | (Photo-PTI)

Hyderabad, Dec 1: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ (GHMC Election Polling Over) ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే చాలా కేంద్రాల్లో ఓటర్లు లేక పోలింగ్ సిబ్బంది ఖాళీగా కూర్చున్నారు. ఉదయం సమయంలో ఎక్కువగా నమోదైన పోలింగ్.. మధ్యాహ్నం భారీగా తగ్గిపోయింది. మొత్తంగా గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో ( GHMC Election 2020) పోలింగ్ శాతం దారుణంగా పడిపోయింది. గ్రేటర్‌ పరిధిలోని 149 డివిజన్లలో పోలింగ్‌ ముగియగా ఈనెల 4న ఓట్లు లెక్కించనున్నారు.

ఐటీ కారిడార్‌లో అయితే పరిస్థితి మరీ దారుణంగా మారింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గుర్తుల తారుమారు వల్ల ఒక్క ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో మాత్రమే రీ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్కడ సీపీఐ, సీపీఎం గుర్తులు తారుమారు కావడంలో రీపోలింగ్ అనివార్యమైంది. డిసెంబర్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల కమిషన్‌, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు చేసిన కార్యక్రమాలేవి పెద్దగా ఫలించ లేదు. హైదరాబాద్‌ పోలింగ్‌ శాతం దారుణంగా పడిపోయింది. గ్రేటర్‌ వాసుల్లో ఈసారి కూడా నిర్లక్ష్యం భారీగా కనిపించింది. గత ఎన్నికలతో పోల్చితే మరి దారుణంగా ఉంది. 2010లో 42 శాతం.. 2016లో 45 శాతం పోలింగ్‌ నమోదైతే ఈసారి సాయంత్రం 4 గంటల వరకు 30 శాతమే పోలింగ్‌ నమోదు కాగా... సాయంత్రం 5 గంటల వరకు 35.80 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

వెలవెలబోతున్న ఓటింగ్ కేంద్రాలు, బయటకు రాని ఓటరు, 3 గంటల వరకు 25.34 శాతం ఓటింగ్ నమోదు, ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు

వరుస సెలవులు రావడం. ప్రభుత్వం సెలవు ప్రకటించినా పలు ప్రైవేట్‌ సంస్థలు ఉద్యోగులకు లీవ్‌ ఇవ్వకుండా ఉండటం. వర్క్‌ఫ్రం హోంతో ఇప్పటికీ హైదరాబాద్‌ చేరుకోని ఐటీ ఉద్యోగులు. కరోనా ప్రభావం గ్రేటర్‌ పోలింగ్‌పై స్పష్టంగా కనిపించిందని పలువురు అభిప్రాయపడ్డారు.

రీ పోలింగ్ నేపథ్యంలో డిసెంబర్ 3 సాయంత్రం  ఆరువరకు ఎవరూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.