GHMC Election Results 2020: దూసుకెళ్తున్న కారు, గట్టి పోటీ ఇస్తున్న బీజేపీ, ఎంఐఎం పార్టీలు, చతికిల పడిన కాంగ్రెస్, జీహెచ్‌ఎంసీ మేయర్ పీఠం కైవసం చేసుకునే దిశగా కేసీఆర్ సర్కారు
TRS VS BJP (File Image)

Hyderabad, Dec 4: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ దూసుకుపోతోంది. పోలింగ్ ఫలితాలు వెలువడే కొద్ది టీఆర్ఎస్ తన సీట్ల సంఖ్యను పెంచుకుంటో పోతోంది. మొదట లెక్కించిన పోస్టల్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డ అధికార టీఆర్‌ఎస్‌... బ్యాలెట్‌ ఓట్లలో జోరుపెంచింది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. టీఆర్‌ఎస్‌ 57 డివిజన్‌లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 22, ఎంఐఎం అభ్యర్థులు  31 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.

మెహదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించి.. గ్రేటర్‌లో తొలి గెలుపును నమోదు చేసింది. అక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థి, మాజీ డిప్యూటీ మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ విజయం సాధించారు. యూసఫ్‌గూడ (రాజ్‌కుమార్‌ పటేల్‌), మెట్టుగూడ (రాసూరి సునీత) డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మరోసారి గ్రేటర్‌ పీఠంపై గులాబీ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తోంది.

గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. హైదరాబాద్‌లోని ఏఎస్‌రావు నగర్‌లో సింగిరెడ్డి శిరీషా రెడ్డి గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పట్నుంచి లీడింగ్‌లో ఉంటూ వస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చివరికి విజయం సాధించారు.

పలుచోట్ల టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. మరికొన్ని డివిజన్‌లలో మాత్రం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు మజ్లీస్‌ సైతం మరోసారి తన పట్టునిలుపుకుంది. సిట్టింగ్‌ స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు.

ఇక గ్రేటర్‌ ఫలితాల్లో గులాబీ పార్టీకి అనుకూలంగా తీర్పు వెలువడుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆపార్టీ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ పరిధిలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు.