Hyderabad, Jan 3: గతేడాది జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సకాలంలో ఎన్నికల ఖర్చుల వివరాలను అందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి సూచించారు. నిర్ణీత సమయంలో ఈ వివరాలను అందించని పక్షంలో అనర్హతకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నెల 8న ఎన్నికల వ్యయ పరిశీలకులతో సమీక్ష నిర్వహించనున్నామని చెప్పారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, జోనల్ కమిషనర్లు, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు పలువురు శనివారం పార్థసారధిని (State Election Commissioner Parthasarathy) కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections) గెలుపొందిన అభ్యర్థుల జాబితాను గెజిట్‌లో ప్రచురించాల్సి ఉందని, వెంటనే ఆ జాబితాను పంపాలని అధికారులను కోరారు. మునిసిపల్ శాఖ సంచాలకులు డాక్టర్ సత్యనారాయణ, శాఖ కార్యదర్శి సుదర్శన్, ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాగా జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ (TRS) 56 డివిజన్లలో గెలుపొందింది. తెలంగాణ (Telangana) ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి వరుస ప్రభంజనాలు సృష్టించిన టీఆర్‌ఎస్ పార్టీ ఈ సారి అంచనాలను పూర్తిగా తారుమారు చేసింది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections) 150 డివిజన్లకు గాను 99 డివిజన్లను దక్కించుకున్న టీఆర్‌ఎస్.. రాష్ట్ర రాజకీయాల్లో పట్టును నిలుపుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా 56 స్థానాలతో సరిపెట్టుకుంది.
పాతబస్తీలో ఎదురులేని ఎంఐఎం (AIMIM).. గత ఎన్నికల్లో గెలిచిన 42 స్థానాలతో పాటు మరో రెండు స్థానాలను గెలుచుకుని 44 సీట్లతో నిలిచింది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 68 డివిజన్లకు గాను కేవలం 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ (BJP) ఈసారి అనూహ్యంగా రెండో స్థానం దక్కించుకుంది. 48 డివిజన్లలో విజయం సాధించి టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ (Congress) మునుపెన్నడూ లేని స్థాయిలో భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఆ పార్టీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది.