Hyderabad, Aug 05: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం (TSRTC Merger Bill) చేసేందుకు రూపొందించిన బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. ఇందులో భాగంగా గవర్నర్ అనుమతి కోసం ఆర్టీసీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోసం పంపింది. బిల్లుకు గవర్నర్ (Governor) ఆమోదం తెలపకుండా పలు సందేహాలు లేవనెత్తి ప్రభుత్వం వివరణ కోరారు. వాటికి ప్రభుత్వం వివరణ ఇచ్చే క్రమంలో మరో వైపు ఆర్టీసీ కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రాజ్‌భవన్ ముట్టడించారు. కార్మిక సంఘాల నేతలతో పుదుచ్చేరి నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ చర్చించారు. కార్మికులకు మేలు చేసేందుకే ప్రభుత్వాన్ని వివరణ కోరినట్టు చెప్పారు. ఈక్రమంలోనే ప్రభుత్వం కూడా గవర్నర్ సందేహాలకు వివరణ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన వివరణతో (TSRTC Merger Bill) సంతృప్తి చెందని గవర్నర్ బిల్లుకు సంబంధించి మరిన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ ఆరు అంశాలపై వివరణలు కోరారు. ప్రభుత్వం నుంచి ఇప్పటికే అందిన వివరణలు, ఉద్యోగుల నుంచి వచ్చిన వినతుల ఆధారంగా తాజా వివరణలు కోరినట్లు రాజ్‌భవన్ (Rajbhavan) పేర్కొంది. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వం వాటా 30శాతం ఉన్నందున కేంద్ర సమ్మతి పొందారా? లేదా? అన్న విషయమై వివరణ కోరారు. సమ్మతి పొందితే ప్రతిని ఇవ్వాలని లేదంటే చట్టబద్ధత పాటించేలా తీసుకున్న చర్యలు తెలపాలని కోరారు. సంస్థలోని శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల సంఖ్యను కేటగిరీలు, డిపోల వారీగా మొత్తం వివరాలు అందించాలని కోరారు. కాంట్రాక్టు, క్యాజువల్, ఇతర ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య కూడా కావాలని తెలిపారు. తాత్కాలిక ఉద్యోగుల కోసం తీసుకునే చర్యల వివరాలు కూడా అడిగారు. భూములు, భవనాలు తదితర ఆర్టీసీ స్థిర, చరాస్థులు కార్పోరేషన్ లోనే కొనసాగుతాయా? లేక వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? అని గవర్నర్ ప్రశ్నించారు.
బస్సులను నడిపే బాధ్యత ఎవరిదని, ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత నిర్వహణ బాధ్యత ఎవరిదని అడిగారు. ఉద్యోగులు, రోజువారీ ప్రయాణీకుల ప్రయోజనాల పరిరక్షణలో కార్పొరేషన్ పాత్ర వివరాలు కోరారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ సర్వీసులో చేరిన తర్వాత వారు సంస్థలో డిప్యుటేషన్‌పై పనిచేస్తారా?లేక ఇతర ఏర్పాట్లు చేస్తారా?అని గవర్నర్ ప్రశ్నించారు. ఈ అంశాలపై వీలైనంతర త్వరగా స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన గవర్నర్... బిల్లుపై నిర్ణయం తీసుకునేందుకు ఈ వివరణలు ఉపయోగపడతాయని అన్నారు. గవర్నర్ రెండో మారు కోరిన వివరణలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంపింది. రాజ్ భవన్ నుంచి దస్త్రం వచ్చిన కొద్ది సమయానికే అన్ని వివరణలను పంపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమనేది ఉద్యోగులు కోరుకుంటున్న భావోద్వేగపు అంశమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఉద్యోగుల చిరకాల కోరిక నెరవేరడంలో అడ్డుపడాలని రాజ్‌భవన్‌కు లేదని ఆమె స్పష్టం చేశారు. బిల్లుపై గవర్నర్ స్పందిస్తూ.. ‘‘ఆర్టీసీలోని ప్రతీ ఉద్యోగి ప్రయోజనాలను పరిరక్షించాలన్నదే రాజ్‌భవన్ ఆలోచన. తదుపరి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగుల ప్రయోజనాలు పరిరక్షిస్తామన్న సీఎస్ వివరణ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్‌లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా విలీన ప్రక్రియ సాఫీగా జరగాలి. ఉద్యోగుల ఆందోళనను ప్రతిపాదిత బిల్లు పూర్తి స్థాయిలో పరిష్కరించేలా ఉందా.. లేదా? అన్నదే ప్రధాన అంశం’’ అని గవర్నర్ తెలిపారు.