High Court of Telangana | (Photo-ANI)

Hyd, Jan 30: తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని హైకోర్టు (TS High Court) నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. యథాతథ స్థితినే కొనసాగించాలని చెబుతూ.. కొత్త సభ్యులతో ప్రమాణం చేయించొద్దని మంగళవారం తన ఆదేశాల్లో పేర్కొంది.

గవర్నర్‌ కోటాలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌ (Kodandaram), మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ (Mir Ameer Ali Khan) ఎమ్మెల్సీలుగా నియమితులైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ల చేత ప్రమాణం చేయించవద్దని కోర్టు ఆదేశించింది.

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌. ఎమ్మెల్సీలుగా తమ పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పటిషన్‌ విచారణ తేలెంత వరకు పిటిషన్‌ విచారణ ఆపాలంటూ కోరారు. అయితే కోర్టు వాళ్ల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ప్రమాణం చేయించవద్దని చెబుతూ.. ఫిబ్రవరి 8వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది.

గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండ రామ్, అమీర్ అలీ ఖాన్ పేర్లు ఆమోదించిన గవర్నర్ తమిళిసై..

మంత్రి మండలి తీర్మానం చేసి పంపిన పేర్లను ఆమె తిరస్కరించారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై స్పష్టత వచ్చే వరకు కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణస్వీకారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని కొత్త ప్రభుత్వం రద్దు చేసిందని గవర్నర్ కార్యదర్శి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. స్టేటస్‌ కో విధిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది.

కొద్ది నెలల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ప్రకటించింది. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ నామినేట్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ కు పంపారు. అయితే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ వీరి పేర్లను ఆమోదించలేదు. ఇంతలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.

అయితే గవర్నర్ తమ పేరును ఆమోదించకపోవడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని.. దాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ లేదని వారు పేర్కొన్నారు. వీరి పిటిషిన్ పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. ఈలోపే కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌లను కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌ కోటాకు ప్రతిపాదించగా.. అందుకు గవర్నర్‌ ఆమోదం తెలపడంతోనే రాజకీయ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.తాజాగా హైకోర్టు బ్రేక్ వేసింది.