Hyderabad, JAN 02: హెచ్‌ఎండీఏ పరిధిలోని అన్ని చెరువుల ఎఫ్‌టీఎల్‌ను (FTL) గుర్తించి నోటిఫికేషన్ జారీకి సంబంధించిన ప్రక్రియ ఏ దశలో ఉందో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు (high court) ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని రామమ్మ కుంటలో ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ నిర్మాణాలు చేపట్టడంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించిన అంశాన్ని ప్రత్యేకంగా విచారణ చేపడతామంటూ సుమోటో పిటిషన్‌గా ధర్మాసనం స్వీకరించింది.
ఈ సుమోటో పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. హెచ్ఎండీఏ (HMDA) పరిధిలో 3,342 చెరువులున్నాయని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇందులో 2,793 చెరువులకు ఎఫ్‌టీఎల్ గుర్తింపునకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. 708 చెరువులకు ఎఫ్‌టీఎల్ గుర్తిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన తరువాత మరో 57 చెరువులకు తుది నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు.
మిగిలిన చెరువులకు ఎఫ్‌టీఎల్ నోటిఫికేషన్ జారీ చేయడానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించడానికి కొంత గడువు కావాలని కోరారు. ఈ వివరాలను నమోదు చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేసింది. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.