Hyderabad, NOV 30: త్వరలో హైడ్రా పోలీస్‌స్టేషన్ (Hydraa Police Station) రాబోతోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) తెలిపారు. బేగంపేటలోని ఓ హోటల్‌లో జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సుకు రంగనాథ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ చర్యలపై ఎక్కువగా దృష్టిపెట్టామన్న రంగనాథ్.. లోటస్‌పాండ్‌లో (Lotus Pond) ఏకంగా ఓ వ్యక్తి ఎకరం స్థలం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే హైడ్రా అడ్డుకుందన్నారు. హైడ్రా చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో కోర్టు తీర్పులు కూడా స్పష్టంగా ఉన్నాయన్నారు.
‘‘ఎక్కువగా సంపన్నులే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారు. ఆక్రమణలకు గురైన స్థలాల్లో పేదలకంటే ధనికులే ఎక్కవగా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలవారు ఆక్రమణల్లో ఉన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎవరినీ వదలం. హైడ్రాకు (Hydraa) వచ్చే ఫిర్యాదులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటాం’’ అని రంగనాథ్ తెలిపారు.