Weather Forecast: భారీ వర్షాలు, తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, అన్ని జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం
Representational Image | (Photo Credits: PTI)

Hyd, June 17: తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రానికి ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. ఇదే సమయంలో శుక్రవారం నాడు కుమ్రం భీం ఆసిఫాబద్‌లో అత్యధికంగా 73.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాతి స్థానంలో 62.2 మిల్లీమిటర్ల వర్షపాతంతో సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కూడా శుక్రవారం నాడు వర్షాలు పడ్డాయి.

జూన్ 18 వ తేదీన ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూల్, వనపర్తి, నారాయణ్ పేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. జూన్ 19వ తేదీన కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.