Medaram Sammakka Saralamma Jatara (Photo-Twitter)

Mulugu, FEB 23: మేడారం మ‌హా జాత‌ర‌కు (Medaram) భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మ గ‌ద్దెల‌పైకి చేర‌డంతో జాత‌ర‌కు నిండుద‌నం వ‌చ్చింది. దారుల‌న్నీ మేడారానికి అన్న‌ట్టుగా.. వ‌న‌దేవ‌త‌ల ద‌ర్శ‌నానికి ల‌క్ష‌లాది మంది భ‌క్తులు త‌ర‌లివ‌స్తున్నారు. దీంతో మేడారం – తాడ్వాయి (Heavy Traffic Jam Near Medaram) మ‌ధ్య సుమారు 15 కిలోమీట‌ర్ల మేర‌, ప‌స్రా నుంచి గోవింద‌రావుపేట వ‌ర‌కు ఐదు కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్‌జామ్ అయింది. ఇరువైపుల వాహ‌నాలు ముందుకు క‌ద‌ల‌క‌పోవ‌డంతో భ‌క్తులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రో వైపు భ‌క్తుల ర‌ద్దీని నియంత్రించేందుకు తిరుగు ప్ర‌యాణంలో నార్లాపూర్ నుంచి బ‌య్య‌క్క‌పేట‌, భూపాల‌ప‌ల్లి మండ‌లం దూదేకుల‌ప‌ల్లి నుంచి గొల్ల‌బుద్దారం, రాంపూర్ మీదుగా క‌మ‌లాపూర్ క్రాస్ రోడ్డు వ‌ర‌కు వ‌న్ వే ర‌హ‌దారిని ఏర్పాటు చేశారు.

 

ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా వాహ‌నాలు కాటారం మీదుగా వెళ్లేందుకు అనుమ‌తిస్తున్నారు. జాత‌ర‌లో ఇద్ద‌రు భ‌క్తులు గుండెపోటుతో మృతి చెందారు. వారికి తీవ్రంగా ఛాతి నొప్పి రావ‌డంతో కుటుంబ స‌భ్యులు హుటాహుటిన ఉచిత వైద్య శిబిరానికి త‌ర‌లించారు. అప్ప‌టికే ఇద్ద‌రు మృతి చెందిన‌ట్లు డాక్ట‌ర్లు నిర్ధారించారు. మృతులు పెద్ద‌ప‌ల్లి జిల్లాకు చెందిన ల‌క్ష్మి(68), విజ‌య‌వాడ‌కు చెందిన సాంబ‌య్య‌(40)గా పోలీసులు గుర్తించారు.