Group 2 Provisional List - High Court - TSPSC | File Photo

Hyderabad, November 20:  తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా గత నెల అక్టోబర్ 24న వెలువడిన ప్రొవిజనల్ ఫలితాల లిస్టుపై హైకోర్ట్ స్టే విధించింది. 2015-16 ఏడాదిలో నిర్వహించిన గ్రూప్ II (Group 2) సర్వీసులకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన పరీక్ష ఫలితాలలో మొత్తం 1027 మంది అభ్యర్థులు తుది జాబితాలో చోటు సంపాదించారు. అయితే కొంతమంది జవాబు పత్రాల్లో వైట్‌నర్లు వాడుతూ దిద్దుబాట్లు చేశారు. వారు కూడా ప్రొవిజనల్ లిస్టులో చోటు సంపాదించారని, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బుధవారం వీరి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు (High Court of Telangana), టీఎస్పీఎస్సీ విడుదల చేసిన ప్రొవిజనల్ లిస్టుపై స్టే విధించింది. అయితే ఆ జాబితాలో "వైట్‌నర్స్" వాడిన వారిని మినహాయించి, మిగతా అభ్యర్థుల కొరకు 1:2 పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహించుకోవచ్చునని ప్రభుత్వానికి హైకోర్ట్ సూచించింది.

దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా TSPSC ని హైకోర్ట్ ఆదేశించింది, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నియామకాలు చేపట్టవద్దని స్పష్టంచేస్తూ, విచారణను సోమవారానికి వాయిదా వేసింది.