Hyderabad, April 5: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని, తనను మోసం చేశాడని ఓ హిజ్రా పోలీసులకు ఫిర్యాదు (Hijra complaint against her husband) చేసింది. కాప్రా సర్కిల్ నెహ్రూ నగర్ కు చెందిన హిజ్రాకు నగరంలోని మల్లేపల్లికి చెందిన నాగేందర్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిన తరువాత 2019లో ఇద్దరూ ఒక్కటయ్యారు. కొద్ది రోజులు సఖ్యంగానే నడిచిన కాపురంలో ఆ తర్వాత మనస్పర్థలు వచ్చాయి.
కొంత కాలంగా తనను పట్టించుకోవడం లేదని వేధింపులకు గురి చేస్తున్నాడని న్యాయం చేయాలని హిజ్రా భర్తపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో (Kushaiguda police station) ఫిర్యాదు చేరింది. అయితే తల పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేయకుండా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తామని చెబుతున్నారు. మంగళవారం ఇద్దరికీ కౌన్సిలింగ్ ఏర్పాటు చేశామని సీఎ మన్ మోహన్ తెలిపారు.
గడిచిన ఏడాదిన్నరగా నాగేందర్ ఖర్చులతో పాటుగా అతడి ఇంటి పోషణకు కావాల్సిన డబ్బులు కూడా తానే ఇచ్చానని దివ్య చెబుతోంది. తీరా మరో అమ్మాయి మోజులో పడి నన్ను వదిలించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని నాకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. అతడు ఏ పని చేసేవాడు కాదు. నేనే అతడిని ఏడాదిన్నర నుంచి పోషిస్తున్నా.
అడిగినప్పుడల్లా వేలకు వేలు డబ్బులు ఇచ్చా. ఇప్పుడు నన్ను మోసం చేశాడు. అతడికి ఈ మధ్యనే వేరే అమ్మాయి పరిచయం అయింది. అందుకే నన్ను నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు. నిలదీస్తే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ అమ్మాయితో కలిసి ఉంటున్నాడని హిజ్రా ఆరోపిస్తోంది.