Hyd, Feb 17: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఎమ్మెల్యేలకు ఎర కేసు(MLAs Poaching Case)ను రాష్ట్ర హైకోర్టు (TS Highcourt) సీబీఐకి అప్పగించడంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడా ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది జెఠ్మలానీ వాదనలు వినిపించారు.
తెలంగాణ ప్రభుత్వం తరుపున సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే పలు కీలక అంశాలను ధర్మాసనం ముందు వినిపించారు.సీబీఐ, ఈడీ మీడియాకు లీకులు ఇస్తున్నాయిని, ఈ కేసులో సీబీఐ ఒత్తిడి చేయకుండా ఆర్డర్ ఇవ్వాలని కోరారు. సిట్ దర్యాప్తులోని ఆధారాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని.. ఈ క్రమంలో కేసు విచారణను సీబీఐకి ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు.
కేసుపై వాదనల కోసం తనకు ఎక్కువ సమయం కావాలని కోరారు. ఈ కేసులో నిందితులపై నమోదైన కేసులు తీవ్రమైనవని.. ఈ వ్యవహారం ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించేదిగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది దవే కోర్టుకు తెలిపారు.
కేసు వివరాలను తెలంగాణ సీఎం మీడియాకు తెలిపారని.. ఆయనే స్వయంగా లీక్ చేశారని బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది జెఠ్మలానీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో ధర్మాసనం స్పందిస్తూ ఈనెల 27న దీనిపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఆ రోజు కోర్టు జాబితాలో ఉన్న అన్ని కేసులు ముగిసిన తర్వాతే దీనిపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీచేస్తూ ఇటీవల హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సిట్ దర్యాప్తు రద్దుచేస్తూ.. కేసుకు సంబంధించిన రికార్డులన్నీ సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది. దీంతో సీబీఐ దర్యాప్తు జరపాలన్న హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.