Hyderabad, Aug 12: వ్యూస్ కోసం కొందరు వికృత చర్యలకు తెగబడుతున్నారు. ఇందులో భాగంగా జాతీయ పక్షి నెమలి కూరను (How to Cook Peacock Curry) ఎలా వండాలో అంటూ సిరిసిల్లకు చెందిన ఓ యూట్యూబర్ (Youtube) షాకింగ్ వీడియో చేశాడు. దీనిపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తంగళ్లపల్లికి చెందిన కోడం ప్రణయ్ కుమార్ సంప్రదాయ వంటకాలపై వీడియోలు చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో శనివారం సాంప్రదాయ పద్ధతిలో నెమలి కూర ఎలా వండాలో చూడండి అంటూ ‘ట్రెడిషనల్ పీకాక్ కర్రీ రెసిపీ’ అన్న పేరుతో యూట్యూబ్ లో వీడియో అప్‌లోడ్ చేశాడు. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో వెంటనే స్పందించిన యూట్యూబ్ ఆ వీడియోను తొలగించింది. కానీ అప్పటికే ఓ 140 మందికి పైగా ఆ వీడియో చూశారు.
గతంలో అడవిపంది కూర
ఈ విషయంపై పలువురు కంప్లైంట్ ఇవ్వడంతో సిరిసిల్ల ఫారెస్ట్ అధికారులు స్పందించారు. వీడియో గురించి తెలిసి ప్రణయ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద స్వాధీనం చేసుకున్న కూరను ల్యాబ్ టెస్ట్ కు పంపించారు. కాగా, ప్రణయ్ గతంలో అడవిపంది కూర ఎలా ఉండాలో అనే వీడియో కూడా చేసినట్టు సమాచారం.