Huzurabad, Oct 19: హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక (Huzurabad Bypoll 2021) ముగిసేవరకు దళిత బంధు అమలు ఆపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ నియోజకవర్గానికి ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆ పథకం (Dalit Bandhu scheme) అమలుపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇచ్చిన ఫిర్యాదుపై స్టేట్ ఈసీ చీఫ్ శశాంక్ గోయెల్ ఈ నెల ఎనిమిదో తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఆ లేఖపై చర్చించిన మీదట ఆ పథకానికి సంబంధించిన నగదు బదిలీ ప్రక్రియను పూర్తిగా ఆపేయాలని ఎన్నికల తరువాత కొనసాగించాలని కేంద్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రానికి ప్రత్యుత్తరం పంపారు.
తెలంగాణ రాష్ట్రంలో తొలుత హుజురాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడుకి రూ. 10 లక్షలు బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. ఈ నిధులతో దళితులు ఉపాధి పొందాలన్నది పథకం ఆలోచనగా కేసీఆర్ సర్కారు ప్రకటించింది. ఇందులో భాగంగానే హుజురాబాద్ నియోజకవర్గంలో 21 వేల మంది దళితులను అర్హులుగా గుర్తించారు. ఆ తరువాత మరింత మందిని చేర్చడంతో ఆ సంఖ్య 24, 367కు చేరుకుంది. ఈ క్రమంలో 16 వేల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సుమారుగా రూ. 1655.18 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఇందులో రూ. 32.77 కోట్లు బీమా కింద కేటాయించింది. తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో ఈ పథకానికి బ్రేక్ పడింది.
హుజురాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని దళితబంధు పథకం అమలును ఆపాలని ఆగస్టులో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే ఇప్పుడు దాన్ని ఆపడం హాస్యాస్పదంగా ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కన్వీనర్ పద్మనాభరెడ్డి అన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ అయిందని ఇప్పుడు ఆపి ఏం ప్రయోజనం అని ఆయన వ్యాఖ్యానించారు.