Huzurabad Bypoll: హుజురాబాద్‌‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ, రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి, ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కౌశిక్‌రెడ్డి ఆడియో
Kaushik Reddy (Photo-Facebook)

Hyderabad, July 12: హుజురాబాద్‌ లో (Huzurabad) కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. హుజురాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌, టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా (Congress Leader Kaushik Reddy Resigns) చేశారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానానికి తన రాజీనామా పత్రాన్ని పంపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో సమావేశంలో అన్ని విషయాలు చెబుతానని వెల్లడించారు. మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో హుజురాబాద్‌ టికెట్‌ తనకే వస్తుందని ఓ కార్యకర్తతో ఫోన్‌లో జరిపిన సంభాషణ సంచలనం సృష్టించింది.

మాదన్నపేటకు చెందిన విజేందర్‌ అనే కార్యకర్తతో కౌశిక్‌రెడ్డి మాట్లాడిన ఆడియో ఈ మధ్య వైరల్ అయిన సంగతి విదితమే. ఈ వీడియోలో హుజూరాబాద్‌ టీఆర్ఎస్ (TRS) టికెట్‌ తనకే ఖాయమైనట్లు చెప్పారు. యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని.. ప్రస్తుతం వారి ఖర్చులకు ఒక్కొక్కరికీ రూ.4-5వేలు ఇస్తానని అతడికి తెలిపారు. అయితే ఈ ఆడియో లీక్ఈ పై ఇంకా ఆయన స్పందించలేదు. విషయంపై కాంగ్రెస్‌ (Congress Party) మండలాధ్యక్షుడు రాజిరెడ్డిని కలవాలని విజేందర్‌కు కౌశిక్‌రెడ్డి సూచించారు. ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ను కౌశిక్‌రెడ్డి కలిశారు.

టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్‌. రమణ, ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందజేసిన మంత్రి కేటీఆర్‌, హుజురాబాద్ ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే వార్తలు..

ఈ నేపథ్యంలో ఆయన జరిపిన ఫోన్‌ సంభాషణ బయటకు రావడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పార్టీ ఆయనకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. 24గంటల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. కాగా, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తూ కౌశిక్‌ నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌ అయింది. ఇదిలా ఉంటే, కౌశిక్‌రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ హుజురాబాద్‌లో డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ తీర్మానం చేశారు. ఈ మేరకు హుజురాబాద్ ఇన్‌ఛార్జ్‌ దామోదర రాజనర్సింహకి లేఖ రాశారు.