Hyd, Nov 02: ఈటల రాజేందర్‌ను ఢీకొట్టడంలో టీఆర్ఎస్ పార్టీ తడబడుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామమైన వీణవంకలోని హిమ్మత్ నగర్‌లో ఈటల రాజేందర్‌కు 191 ఓట్ల మెజారిటీ లభించింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు షాక్ తిన్నాయి. ఈటెలపై ఉన్న సానుభూతి బాగా పనిచేసిందని అందుకే అధికార పార్టీ ఎంత ప్రయత్నించినా గెలుపు అందుకోలేకపోయిందని స్థానికులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్ నుంచి బరిలోకి దిగిన గెల్లుకు సొంతూరి ప్రజలే షాకివ్వడం ఈటల పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతిని తెలియజేస్తోంది. ఎనిమిదో రౌండ్‌లో భాగంగా జరిగిన లెక్కింపు ప్రక్రియలో హిమ్మత్ నగర్ గ్రామంలో బీజేపీకి 548 రాగా, టీఆర్‌ఎస్‌కు 358 ఓట్లు వచ్చాయి. అటు కాంగ్రెస్ నుంచి ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి సొంతూరు ఓట్ల లెక్కింపు కూడా జరిగింది. అందులో సైతం బీజేపీనే ఆధిక్యం సాధించింది.
ఇప్పటివరకు 11 రౌండ్ల ఫలితాలు వెలువడగా.. 10 రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబరిచింది. కేవలం టీఆర్ఎస్ 11వ రౌండ్లో 367 ఓట్ల మెజారిటీ సాధించింది.