Hyderabad, May 24: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని వనస్థలిపురం (Vanasthalipuramఏఎఫ్‌సీఐ కాలనీలోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఓ మహిళ (Woman Charred to Death in Fire) సజీవ దహనమైంది. మొదటి అంతస్తులో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎఫ్‌సీఐ కాలనీలో నివాసముంటున్న బాలకృష్ణ, సరస్వతి (42) దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భర్త బాలకృష్ణ తన ఇద్దరు పిల్లలను బయటకు తీసుకొచ్చి తిరిగి తన భార్య సరస్వతిని కాపాడేందుకు లోపలికి వెళ్లారు. అప్పటికే సరస్వతికి మంటలు అంటుకుని శరీరమంతా వ్యాపించాయి. ఆమె అక్కడే చిక్కుకుని సజీవ దహనమైంది.
భార్యను కాపాడే క్రమంలో బాలకృష్ణకూ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపుచేశారు. పోస్టుమార్టం నిమిత్తం సరస్వతి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భర్తను ఎల్బీ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే షార్ట్ షర్క్యూట్ వల్లనే ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది.