Hyderabad: నెలకు మూడు లక్షల జీతం..హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌ జాబ్‌ పేరిట భారీ మోసం, బోర్డు తిప్పేసిన మరో కంపెనీ, సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించిన బాధితులు
Cyberbad Cyber Crime Police (Photo-Video Grab)

Hyd, July 6: హైదరాబాద్‌లో మరో కంపెనీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. యూఎస్ బేస్డ్‌ కంపెనీ అంటూ.. ఆన్‌లైన్‌ జాబ్‌, వర్క్‌ఫ్రమ్‌ హోం పేరిట నిరుద్యోగులకు భారీగా కుచ్చుటోపి పెట్టింది. డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (digital india private company) ఉద్యోగాల పేరుతో యువత నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. నెలకు మూడు లక్షల పైనే జీతం ఇస్తామని ఆశ చూపి..ఐదు లక్షల యాభై వేలు డిపాజిట్ చేస్తే ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తామని బురిడీ కొట్టించినట్లు పోలీసుల (Cyber Crime police) విచారణలో తేలింది.

700 మంది బాధితుల నుంచి సుమారు రూ.50 కోట్ల మేర డిపాజిట్ కట్టించుకుని డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జెండా ఎత్తేయడంతో.. బాధితులంతా సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఆ కంపెనీ ఎండీ అమిత్ శర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

జికా వైరస్ లక్షణాలు ఇవే, దోమలతో చాలా జాగ్రత్తగా ఉండాలి, తెలంగాణలో కలకలం పుట్టిస్తున్న జికా వైరస్, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జికావైరస్ కేసులు, అప్రమత్తతపై హెచ్చరిస్తున్న వైద్యులు

హైదరాబాద్‌లో డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్న ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయాలంటున్నారు. మరోవైపు మోసపోయిన యువత మాత్రం కన్నీరుమున్నీరవుతోంది. ఉద్యోగం కల్పిస్తామని నమ్మించారని అందుకే భారీగా సొమ్ము మూటజెప్పామంటున్నారు. పోలీసులే తమకు న్యాయం చేయాలని వాపోతున్నారు.

కంపెనీ స్కాం ఇదే.. 

బాధితుల కథనం ప్రకారం.. పుస్తకాలు స్కాన్ చేసి పంపాలంటూ కస్టమర్స్‌కు వర్క్ ఫ్రం హోం అప్పజెప్పింది. అంతర్జాతీయ పుస్తకాలు, నవలలు డిజిటల్‌ చేస్తామని. ప్రతీ పేజీకి రూ.5 చొప్పున ఇస్తామని కంపెనీ ప్రకటించింది. అయితే పదివేల పేజీల స్కానింగ్‌ కోసం ఉద్యోగుల నుంచి డిపాజిట్లను వసూలు చేసింది. డిపాజిట్‌ పేరిట ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి ఐదు లక్షల యాభై వేల రూపాయలు వసూలు చేసింది. ఆరు నెలల్లో తిరిగి మీడబ్బు మీకే వస్తుందంటూ అందరి దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసింది.

వెయ్యి మంది నుంచి సుమారు రూ. 50 కోట్లు మేర డిపాజిట్‌ కట్టించుకుని జెండా ఎత్తేసినట్లు కంపెనీ మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిజినల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఎండీ అమిత్ శర్మపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు. శర్మతో పాటు విజయ్‌ఠాగూర్‌ అనే వ్యక్తి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.