Hyderabad, Feb 24: హైదరాబాద్ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పారు పోలీసులు. పెండింగ్ చలాన్లను క్లియర్ (pending challans) చేసుకునేవారికి బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రత్యేకంగా టూవీలర్లపైన భారీ డిస్కౌంట్ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ద్విచక్రవాహనదారులకు 75శాతం డిస్కౌంట్ కల్పించారు. కార్లకు 50శాతం, ఆర్టీసీబస్సులకు 30శాతం, తోపుడు బండ్లకు 20శాతం ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. పెండింగ్ చలాన్లను ఆన్‌లైన్, మీ సేవా సెంటర్లలో చెల్లించవచ్చని తెలిపారు. మార్చి1 నుంచి 30 వరకు నెలరోజులపాటు చలాన్ల క్రియరెన్స్ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ (Hyderabad), సైబరాబాద్ (Cyberabad), రాచకొండ పరిధిలో(Rachakonda) 600 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్ చలాన్లు పేరుకుపోయినట్లు చెబుతున్నారు ఉన్నతాధికారులు.
పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేందుకే ఈ కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చామని చెబుతున్నారు. ఈ ప్రతిపాదన వర్కవుట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని.. పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. పెండింగ్ చలాన్ల విషయంలో ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంపై హర్షం ప్రకటిస్తున్నారు వాహనదారులు.
ఇది కచ్చితంగా గొప్ప ఆఫర్ అంటున్నారు. ఇప్పటికే నగరంలో చాలామంది వాహనాలపై గుట్టలుగా చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. అప్పుడప్పుడు నగరంలో స్పెషల్ డ్రైవ్స్ ఏర్పాటు చేసి చలాన్లు క్లియర్ చేస్తున్నప్పటికీ...పెద్దగా స్పందన రావడం లేదు.
ఇప్పుడు భారీ డిస్కౌంట్ ప్రకటించడంతో...వాహనదారులకు ఊరట లభించనుంది. పైగా ఒక వాహనంపై మూడుకు పైగా చలాన్లు ఉంటే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని ఇప్పటికే హెచ్చరించారు పోలీసులు. ఈ ఆఫర్ అయిపోయిన తర్వాత దాన్ని పకడ్బందీగా అమలు చేసే అవకాశముంది.