Hyd, Jan 11: రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి పాఠశాల పక్కనే ఉన్న పాన్ డబ్బా నిర్వాహకులు మొదలు ఫ్రీగా గంజాయి కలిపిన చాక్లెట్లు అలవాటు చేసి ఆ తర్వాత ఒక్కో చాక్లెట్ 20 రూపాయలకు అమ్ముతున్నారు. ఆ చాక్లెట్లు తిన్న విద్యార్థులు పాఠశాలలో వింతగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆరా తీసి పాన్ డబ్బా నిర్వాహకులను అరెస్ట్ చేశారు.నిందితుల నుంచి 9 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం (Ganja Chocolates Seized in Hyd) చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న పాన్ డబ్బాతో పాటు మరో మూడు కిరాణ దుకాణాల్లో శంషాబాద్ ఎస్‌ఓటీ , కొత్తూరు పోలీసులు సంయుక్తంగా దాడులు (SOT Conducted raids in Pan shops) నిర్వహించారు. ఈ దాడుల్లో 8 కేజీల బరువు కలిగిన ‘చార్మినార్ గోల్డ్ మునకా’అనే పేరుతో ఉన్న 42 చాక్లెట్ల డబ్బాలు స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ 1.30 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. చాక్లెట్లను తీసుకొచ్చి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.
దారుణం, చిన్న పిల్లలకు గంజాయి చాక్లెట్లు అలవాటు చేసిన పాన్ డబ్బా నిర్వాహకులు, వీడియోలు ఇవిగో..
ఒడిశా రాష్ట్రం జస్పూర్ జిల్లాకు చెందిన ధీరేంద్ర బహేరా(33) కొత్తూరులోని పరిశ్రమల్లో కార్మి కుడిగా పనిచేసేందుకు కొంత కాలం కిందట వచ్చాడు. అధికంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో అదే రాష్ట్రానికి చెందిన సోమ్‌నాథ్ బెహ్రే (33) సూర్యమని సాహు (35)తో పాటు పరారీలో ఉన్న మరో వ్యక్తితో కలిసి ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చి స్థానికంగా విక్రయించడం మొదలుపెట్టారు. ప్రభుత్వ పాఠశాలకు సమీపంలో ఓ పాన్ డబ్బాను ఏర్పాటు చేసి విద్యార్థులకు దానిని నెమ్మదిగా అలవాటుగా మార్చారు.
అంతేకాకుండా సమీపంలోని మరికొన్ని కిరాణా దుకాణాల్లో కూడా వాటిని కార్మికులు, కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఒక్కో చాక్లెట్‌ను రూ. 20 లేదా 30కి విక్రయిస్తున్నారు. చాక్లెట్లను ఉత్పత్తి చేస్తున్న ప్రదేశం ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లా మగర్ వారా నెహ్రూబాగ్‌లోని ఏఎం ఫార్మా పేరిట ఉంది. చాక్లెట్ల పై భాగంలో మాత్రం పూర్తి గా హిందీ అక్షరాలతో చార్మి నార్ గోల్డ్ మునకా అని ఉంది. అక్కడ నుంచి ఎలా తీసుకొస్తున్నారు అనే దానిపై లోతైన దర్యాప్తు జరుగుతోందని శంషాబాద్ డీసీపీ వెల్లడించారు.
కొంత చక్కెర, బెల్లం వంటి పదార్థాల్లో చాక్లెట్ ఫ్లేవర్ కలిపి అందులో గంజాయిని కలిపినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఎవరైనా ఇలాంటి చాక్లెట్లు విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ నారాయణరెడ్డి కోరారు. ఎస్‌ఓటీ డీసీపీ రషీద్, శంషాబాద్ అదనపు డీసీపీ రామ్‌కుమార్, శంషాబాద్ ఏసీపీ రాంచందర్‌రావు, కొత్తూరు సీఐ వి.నర్సింహారావు శంషాబాద్ ఎస్‌ఓటీ సీఐ సత్యనారాయణ కేసును ఛేదించారంటూ డీసీపీ అభినందించారు