GHMC Elections 2020 (Photo-File Image)

Hyderabad, December 1: దేశంలో ఐదవ అతిపెద్ద మెట్రోపాలిటన్ నగర ప్రాంతమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు మంగళవారం పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 150 స్థానాలకు 1,122 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలలో, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మొత్తం 150 డివిజన్లలో పోటీ చేస్తుండగా, భారతీయ జనతా పార్టీ 149 డివిజన్లకు, 146 డివిజన్లలో కాంగ్రెస్, 106 డివిజన్లలో తెలుగు దేశం పార్టీ మరియు 51 డివిజన్లలో అఖిల భారత మజ్లిస్-ఇ-ఇట్టెహాదుల్ ముస్లిమీన్ పోటీ పడుతున్నాయి.

ఒక కోటి పైగా జనాభా ఉన్న జిహెచ్‌ఎంసిలో మొత్తం 74,67,256 మంది ఓటర్లు ఉన్నారు, వీరిలో 38,89,637 మంది పురుషులు, 35,76,941 మంది మహిళా ఓటర్లు ఉన్నారు, 687 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. మొత్తం 150 డివిజన్లకు 9,101 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి.

పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. మునుపటి ఎన్నికలలో లాగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో కాకుండా ఈసారి సాంప్రదాయ బ్యాలెట్ పత్రాలను ఉపయోగించి పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది మరియు అదే రోజు సాయంత్రం నాటికి ఫలితాలు వెలువడతాయి అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి విలేకరులతో అన్నారు.

కోవిడ్ -19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అధికారులు ప్రతి పోలింగ్ స్టేషన్‌ను పరిశుభ్రపరిచారు, అలాగే ఓటర్లందరూ పోలింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించే ముందు శానిటైజర్‌ను ఉపయోగించడం తప్పనిసరి చేశారు. మరియు క్యూలైన్లలో నిల్చునేటపుడు ఓటర్లు సామాజిక దూరాన్ని పాటించేలా ఏర్పాట్లు చేశారు.

ఉదయం నుంచే సినీ, రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా తమ డివిజన్లలో వారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ కేంద్రంలో మెగాస్టార్ చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుందన్ బాగ్ లో హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్, కాచిగూడలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి, రాజేంద్రనగర్ శాస్త్రిపురంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మరియు బంజారాహిల్స్ లోని నందినగర్ లో మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈసారి జిహెచ్‌ఎంసి ఎన్నికలను టిఆర్‌ఎస్, బిజెపి, ఎఐఐఎంఐఎం, కాంగ్రెస్ సహా ఇతర అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బిజీపీ తరఫున దిల్లీ నుంచి అగ్రనేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు సైతం తరలిరావడంతో బల్దియా ఎన్నికలు జాతీయ ఎన్నికలను తలపించాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015 డిసెంబరులో జరిగిన ఎన్నికలలో మొదటిసారి టిఆర్ఎస్ 150 సీట్లలో 99 స్థానాలను గెలుచుకుంది మరియు దాని కూటమి భాగస్వామి AIMIM 44 సీట్లు సాధించింది.