Hyderabad, Jan 12: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఆమె వ్యక్తిగత సహాయకుడుతో సహా ముగ్గురి నిందితులని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. భూమా అఖిలప్రియ (AP former minister Bhuma Akhila) అరెస్టుకు సంబంధించి చట్ట ప్రకారమే నడుచుకున్నాం. ఆమెను అరెస్టు చేసేప్పుడు మహిళా ఇన్‌స్పెక్టర్ జ్యోత్స్న, ఎస్సై వెంకటలక్ష్మి ఉన్నారు. రిమాండ్‌కు తరలించే ముందు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ పర్యవేక్షణ లో డాక్టర్ల బృందం పరీక్షించిందని తెలిపారు.
కోర్టు ఆదేశాల ప్రకారం.. జైళ్ల అథారిటీ సైతం ఉస్మానియా ఆసుపత్రి వైద్యబృందంతో మళ్లీ పరీక్షలు చేయించి ఫిట్ అని తేల్చింది. ఫిర్యాదులోని అంశాల ఆధారంగా ఏవీ సుబ్బారెడ్డిని ఏ–1గా చేర్చాం. సికింద్రాబాద్ కోర్టు అఖిలప్రియను 3 రోజుల కస్టడీకి అప్పగించింది. లోతుగా విచారించి మరిన్ని వివరాలు రాబడతామని అంజనీ కుమార్ తెలిపారు.
సుబ్బారెడ్డి ఏ-1 నుంచి ఏ-2గా మార్చడంలో వేరే ఉద్దేశమేం లేదని, దర్యాప్తు ఆధారాలతో కొత్త వ్యక్తులు నిందితులుగా రావచ్చు.. లేదా ఉన్న మొదట అనుమానాస్పదంగా భావించిన వ్యక్తుల పేర్లను తొలగించే వీలు సీఆర్‌పీసీలో ఉన్నదని సీపీ పేర్కొన్నారు. తాజా ముగ్గురి అరెస్టుతో బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో (Bowenpally kidnap case) అరెస్టుల సంఖ్య 4కు చేరింది. 4 గంటల్లో కేసును ఛేదించిన సిబ్బందిని సీపీ అభినందించారు.
కాగా బోయిన్‌పల్లి కిడ్నాప్ (Hyderabad Kidnap Case) వ్యవహారంలో 19 మంది నిందితులు పాల్గొన్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వారిలో మరో ముగ్గురిని సోమవారం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఏ1గా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ పీఏ సంపత్‌కుమార్‌తోపాటు మల్లికార్జునరెడ్డి, బాలచెన్నయ్య ఉన్నారు. ఈ కేసులో ఏ3గా ఉన్న భార్గవరామ్(అఖిలప్రియ భర్త), మరో నిందితుడు గుంటూరు శ్రీను కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కిడ్నాప్ వ్యవహారం కోసం సంపత్‌కుమార్ తన ఐడీ ప్రూఫ్‌లతో 6 సిమ్‌కార్డులను కొన్నట్టు పోలీసులు గుర్తించారు. వా టిని జనవరి 2న యాక్టివేట్ చేయించాడు. అందులో ఒక సిమ్ (7095637583)ను అఖిలప్రియ వాడారని తేలింది. కిడ్నాప్ వ్యవహారాన్ని అఖిలప్రియ ఈ నంబర్ నుంచే ఫాలోఅప్ చేసినట్టు గుర్తించారు. కిడ్నాపర్లు కూకట్‌పల్లిలోని పర్ధా హోటల్‌లో ఉంటూ రెక్కీ చేశారు.
జనవరి 4మధ్యాహ్నం ఒంటిగంటకు.. అఖిలప్రియ నివాసమైన కూకట్‌పల్లిలోని బలేజా అపార్ట్‌మెంట్ నుంచి ఐదు వాహనాల్లో కిడ్నాపర్లు బయల్దేరారు. నేరుగా భార్గవరామ్‌కు సంబంధించి.. యూసూఫ్‌గూడ నవోదయ కాలనీలో ఉన్న ఎంజీఎం స్కూలుకు చేరుకున్నారు. అక్కడ నంబర్ ప్లేట్లను మార్చుకున్నారు. చీకటి పడే వరకు అక్కడే ఉన్నారు. అంతకుముందే బోయిన్‌పల్లిలోని ప్రవీణ్‌రావు ఇంటి వద్దకు నంబర్‌ప్లేట్లు మార్చిన వాహనాల్లో చేరుకున్న సంపత్‌కుమార్, బాలచెన్నయ్య తాత్కాలిక మొబైల్ నంబర్ల నుంచి బాధితుల ఇంటి వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు కిడ్నాపర్లకు అందించారు.
స్కూల్ నుంచి నేరుగా రాత్రి 8.20 గంటలకు బోయిన్‌పల్లిలోని ప్రవీణ్‌రావు ఇంటికి వెళ్లిన కిడ్నాపర్లు హైడ్రామా సృష్టించి ప్రవీణ్‌రావు, నవీన్‌రావు, సునీల్‌రావులను కిడ్నాప్ చేశారు. వార్త బయటికి పొక్కడంతో మొయినాబాద్ వద్ద వదిలేశారు. మంగళవారం రాత్రి ఒంటిగంటకు బాధితుల్లో ఒకరైన సునీల్‌రావుతో నార్త్‌జోన్ డీసీపీకి ఫోన్ చేయించి తాము క్షేమమని చెప్పించారు.
ఆ నంబర్ నుంచే అఖిలప్రియ అసలు నంబర్ (9502248888) కు కాల్ వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. తాత్కాలిక నంబర్‌తో భర్త భార్గవరామ్, కిడ్నాపర్ గుంటూరు శ్రీనుతో టచ్‌లో ఉన్నారు. వ్యూహం విజయవంతమైందని గుంటూరు శ్రీను రాత్రి 10.42 గంటలకు అఖిలప్రియకు ఫోన్ చేసి చెప్పాడు. కాల్‌డాటాను విశ్లేషించగా ఈ విషయాలన్నీ బయటపడ్డాయి.
ఈ నేపథ్యంలో ఈ కేసులో డీసీపీ సైతం కీలక సాక్షిగా మారనున్నారు. మరో మూడు తాత్కాలిక నంబర్లు వాడిన వాళ్లే కీలకం, వారు ఎవరనేది గుర్తిస్తున్నాం. ఇప్పటి వరకు లభించిన ఆధారాలను బట్టి బోయ సంపత్‌కుమార్, ఎన్.మల్లికార్జున్‌రెడ్డి, రెక్కీ నిర్వహించిన బాల చిన్నయ్యలను అరెస్టు చేశాం. భార్గవ్‌రామ్ సహా పరారీలో ఉన్న గుంటూరు శ్రీను, గుంటూరుకు చెందిన ఎం.సిద్ధార్థ, ఎం.కృష్ణ, వి.వంశీ, దేవ ప్రసాద్, శివప్రసాద్, భాను, డి.కృష్ణ చైతన్య, అంజయ్య కోసం గాలిస్తున్నామని సీపీ తెలిపారు.