Hyderabad, June 30: కరోనాతో తన భార్య చనిపోయిందని భర్త అందరికీ చెప్పాడు. అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. కానీ పది రోజుల తర్వాత మృతురాలి తల్లిదండ్లులు అనుమానంతో ఆస్పత్రిలో ఎంక్వైరీ చేశారు. అక్కడ మృతురాలికి నెగటీవ్ వచ్చిందని తేలింది. దీంతో అల్లుడిపై అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం పిల్లగుంట్ల తండాకు చెందిన కవిత, విజయ్ దంపతులు ఇంజాపూర్ గ్రామంలోని సుందరయ్యకాలనీలో నివాసం ఉంటున్నారు. ఈనెల 18న కవిత కరోనాతో మృతి (Man Claims Wife Died of COVID-19) చెందిందని చెప్పి ఆమె భర్త విజయ్ చెప్పాడని కవిత కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహాన్ని హుటాహుటినా గ్రామానికి తరలించి అంత్యక్రియలు చేశారన్నారు. అంత్యక్రియలలో పాల్గొన్న కవిత కుటుంబ సభ్యులు కరోనా టెస్ట్ చేయించుకుంటే అందరికీ నెగెటివ్ (Test Report Finds Her Negative) వచ్చింది.
తమ కూతురిని పథకం ప్రకారం హత్య చేసి కరోనాతో చనిపోయిందని నమ్మించి మోసం చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు నల్గొండ జిల్లా పిఏపల్లి మండల తహసీల్దార్ సమక్షంలో పాతిపెట్టిన కవిత మృతదేహాన్ని పోలీసులు వెలికి తీసి సోమవారం పంచనామా చేశారు. రిపోర్ట్ వస్తే కవిత మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.