
Hyderabad, Nov 16: కెనడాలో హైదరాబాద్ యువకుడు ఆత్మహత్య (HYD Man Suicide in Canada) చేసుకున్నాడు. ప్రేయసితో విభేదాల కారణంగా నత్రజని వాయువు పీల్చుకుని (inhaling nitrogen gas) అతను ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని హబ్సిగుడలో నివసిస్తున్న ప్రణయ్ కొన్నేళ్ల క్రితం కెనడాకు ( Canada) వెళ్లి అక్కడ అఖిలా అనే మహిళతో పరిచయం పెంచుకుని స్నేహితులు అయ్యారు.
అయితే ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారని, ఆగస్టు నెలలో వివాహ లైసెన్స్ పొందారని చెప్పారు. "మేము త్వరలో వివాహం చేసుకోవాలని యోచిస్తున్నాము. వివాహం కోసం ఉపకరణాల కోసం షాపింగ్ కూడా ప్రారంభించాము. అయితే, ఈ మధ్య అఖిలాకు హెచ్ 1 వీసా వచ్చింది. ఆమెతో నాతో బ్రేకప్ చెప్పిన తరువాత అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నన్ను బ్లాక్ చేసింది ”అని ఆ వ్యక్తి వీడియో సందేశంలో పేర్కొన్నాడు.
కాగా, ప్రియురాలు మోసం చేసిందని సెల్ఫీ వీడియో తీసుకుని అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనతోపాటు మరో ఆరుగురు యువకులను మోసం చేసిందంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. సిగరెట్లు తాగుతూ తనను కూడా స్మోక్ చేయాలని బలవంతం పెట్టిందని తెలిపాడు. చివరికి హెచ్1 వీసా రాగానే తనకు తెలియకుండా మోసం చేసి వెళ్లిపోయిందని, తనతో సహజీవనం చేస్తూనే మాజీ ప్రియుడితో చాట్ చేసేదని, చాటింగ్ చేయవద్దని చెప్పినందుకు తరచూ గొడవపడేదని ప్రణయ్ ఆ వీడియోలో పేర్కొన్నారు.
తనను పెళ్లి చేసుకుందామని తాను అనుకుంటే తనను మోసం చేసిందన్నాడు. ఆమె తల్తిదండ్రులు కూడా ఇప్పుడు వారి కూతురుకే మద్దతుగా ఉన్నారని, తనపై కేసు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపాడు. ఆ యువతి మోసాల గురించి తెలపాలని తాను ఇలా సూసైడ్ నోట్‌లో వివరించి చనిపోతున్నట్లు పేర్కొన్నాడు. వివాహం తర్వాత సంతోషకరమైన జీవితాన్ని గడపాలని తాను ప్లాన్ చేశానని, వ్యక్తుల మధ్య చిన్న సమస్యలు జరుగుతాయని అయితే ఇలా జరగడం బాధగా ఉందని వీడియోలో తెలిపారు. "నేను ఎటువంటి తప్పు చేయలేదు" అని ప్రణయ్ ఆ సందేశంలో పేర్కొన్నాడు.
తన గురించి ఎవరూ బాధపడవద్దని, తన అవయవాలు దానం చేయాలని, తన శరీరాన్ని కూడా పరిశోధనల్లో వాడేలా చూడాలంటూ ప్రణయ్ తన తల్లిదండ్రులను కోరాడు.కెనడా అధికారులు మృతుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు ప్రేయసి తనను మోసం చేసిన వైనాన్నియూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనలాగా మరొకరు మోసపోకూడదనే ఈ వీడియోను రూపొందించినట్లు ప్రణయ్ ఆత్మహత్య చేసుకోకముందు తెలిపాడు. కొడుకు ఆత్మహత్య ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
వనస్థలిపురానికి చెందిన మరో యువకుడు మృతి
ఇదిలా ఉంటే వనస్థలిపురానికి చెందిన మరో యువకుడు కెనడాలోని టొరంటోలో బహుళ అంతస్తుల భవనంపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఫేజ్-4లో నివాసం ఉంటున్న శ్రీకాంత్ చిన్న కుమారుడు పాణ్యం అఖిల్(19) కెనడాలోని టొరంటోలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తున్నాడు. మొదటి సెమిస్టర్ పూర్తి చేసుకుని గత మార్చి 20న నగరానికి వచ్చిన ఆయన.. తిరిగి అక్టోబర్ 5న కెనడాకు వెళ్లాడు. ఈ నెల 8న తెల్లవారుజామున తాను ఉంటున్న భవనంలోని 27వ అంతస్తు బాల్కనీలో ఫోన్‌లో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. అతని స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.