Hyd, Dec 13: హైదరాబాద్ సీపీగా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి (Hyderabad CP Kothakota Srinivas Reddy)బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత శ్రీనివాస్‌రెడ్డికి ప్రాధాన్యత గల పోస్టింగ్ మొదటి సారి వచ్చింది. గతంలో గ్రే హౌండ్స్ , అక్టోఫస్‌లో ఆయన పనిచేశారు. నూతన సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డికి ముక్కుసూటి అధికారిగా పేరు ఉంది. బుధవారం ఉదయం రోడ్ నెంబర్ 12 లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీపీ శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సీఎంకు ధన్యవాదాలు. హైదరాబాద్ కమిషనరేట్‌లో విధులు నిర్వహించడం సవాళ్లతో కూడుకున్నది. డ్రగ్స్ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించాలని సీఎం చెప్పారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ మూలాలుంటే సహించేది లేదు. దీనిపై సినీ రంగానికి చెందిన పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తాం. చట్టాన్ని గౌరవించే వారితో ఫ్రెండ్లీ పోలీసింగ్.. ఉల్లంఘించే వారితో కఠినంగా వ్యవహరిస్తాం. అధికారులు, సిబ్బంది సహకారంతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తా. ప్రజలకు వేగంగా సేవలు అందించేందుకు కృషి చేస్తాం’’ అని సీపీ అన్నారు.
డ్రగ్స్ సరఫరా ముఠాలకు రాష్ట్రంలో చోటులేదని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పబ్స్, రెస్టారెంట్లు, ఫామ్‌హౌస్ యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. డ్రగ్స్ ముఠాలను సహించేది లేదని.. వారిని ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.ఇప్పుడు హైదరాబాద్ మహా నగరం లో డ్రగ్స్, జూదంను నిర్మూలిస్తామన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా మీడియా ఉంటుందని తెలిపారు.
ప్రజాభిప్రాయాన్ని మీడియా ద్వారా తెలియజేయాలని కోరుతున్నానన్నారు. మెట్రో పాలిటీన్ సిటిలో మూడు అంశాలపై అలెర్ట్ ఉండాలన్నారు. సంఘటన జరిగినప్పుడు పోలీస్ క్విక్ రెస్పాన్స్ అనేది చాలా ప్రధానమని చెప్పుకొచ్చారు. మహిళల వేధింపులు, ర్యాగింగ్‌లపై షీ టీమ్స్ ద్వారా మరింత పని తీరును మెరుగు పరుస్తామన్నారు.
తెలంగాణా స్టేట్‌తో పాటు హైదరాబాద్‌ను డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చి దిద్దాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారన్నారు. హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనర్లతో కూడా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తామన్నారు. డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాడమే తమ లక్ష్యమన్నారు. గతంలో డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపారన్నారు. హైదరాబాద్, తెలంగాణాను డ్రగ్స్ ముఠాలు వదిలి వెళ్ళాలని.. లేకపోతే ఉక్కుపాదం మోపుతామని డ్రగ్స్ ముఠాను హెచ్చరించారు. సినీ ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించామన్నారు. మారకపోతే సినీ ఇండస్ట్రీలో ఉన్న వారిపై కూడా ఉక్కుపాదం మోపుతామన్నారు. సినీ పెద్దలతో త్వరలో మీటింగ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.