హైదరాబాద్ నగరంలో పంజగుట్టలో హర్రర్ చోటు చేసుకుంది. అర్ధరాత్రి 15 మంది యువకులు కార్లల్లో వచ్చి ఓ యువకునిపై విచక్షణారహితంగా దాడి చేశారు.పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంకు చెందిన ఇస్లావత్ జయరామ్ నార్సింగ్‌లో నివాసముంటాడు. ఖమ్మంలో ఇతను ఉండే ఏరియాలోనే దేవరగట్టు శ్రీరామ్ అలియాస్ శ్రీధర్ ఉంటాడు. వీరిద్దరికీ పడదు. తరచూ గొడవలు జరుగుతుంటాయి.
గత ఆరు నెలలక్రితం గుజరాత్‌లో శ్రీరామ్‌ను మనుషులను పెట్టి కొట్టించాడు జయరామ్.దీంతో కక్ష పెంచుకున్న శ్రీరామ్ ఎప్పుడు చాన్స్ దొరికినా జయరామ్ అంతుచూడాలనుకున్నాడు. శనివారం రాత్రి శ్రీరామ్ జయరామ్‌కు ఫోన్‌చేసి అమీర్‌పేట వద్ద ఉన్నాను దమ్ముంటే ఇక్కడకు రా అని ఛాలెంజ్ చేశాడు. దీంతో పంజగుట్ట ప్రాంతంలోనే ఉన్న జయరామ్ భయపడి అతని స్నేహితులు కౌశిక్, అభిలాష్లను పిలిపించుకుని ముగ్గురూ కలిసి యాక్టీవా ద్విచక్రవాహనంపై పంజగుట్ట మెట్రోమాల్ ముందునుండి వెళుతున్నారు.
వీళ్లు ఇక్కడ ఉన్నట్లు తెలుసుకున్న శ్రీరామ్ అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో 15 మందితో కలిసి కార్లల్లో వచ్చి జయరామ్‌పై విచక్షణరహితంగా దాడి చేశారు.స్థానికులు ఎంత అడ్డగించినా వినకపోవడంతో జయరామ్ స్నేహితులు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదుచేశారు.
వెంటనే పోలీసు పెట్రోకార్ అక్కడకు వెళ్లగానే జయరామ్‌ను వారి కారులో ఎక్కించేందుకు యత్నిస్తున్న శ్రీరామ్ గ్యాంగ్ అక్కడనుండి పారిపోయారు. పోలీసులు వారిని పట్టుకునేందుకు యత్నించినా ప్రయోజనం లేకపోయింది. జయరామ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందించారు. అతని నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.