Narsingi, Feb 7: ide పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగర శివారు అయిన నార్సింగిలో భార్యతో గొడవపడి ఓ భర్త ఆత్మహత్యకు ప్రయత్నించాడు. భార్య కళ్లెదుటే బిల్డింగ్ పై నుంచి దూకేశాడు. తీవ్ర గాయాలవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీరం చెరువు ప్రాంతంలో రేవన్ సిద్దప్ప తన భార్యతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ విషయంపై మాటామాటా పెరగడంతో సిద్దప్ప తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. భార్య చూస్తుండగానే బిల్డింగ్ పై నుంచి దూకాడు. చుట్టుపక్కల వాళ్లు గమనించి సిద్దప్పను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అతనిని కాపాడడానికి వైద్యులు తీవ్రంగా శ్రమించారు. అయితే, గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడం, తీవ్ర రక్త స్రావం కారణంగా సిద్దప్ప ప్రాణాలు కోల్పోయాడు. తను చూస్తుండగానే భర్త బలవన్మరణానికి పాల్పడడంతో సిద్దప్ప భార్య కన్నీటిపర్యంతమవుతూ షాక్ కు లోనయ్యింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.