Hyd, June 1: గత ఏడాది 60 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్ మహాగణపతి ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 61 అడుగులతో భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు బుధవారం నిర్వహించిన కర్రపూజా కార్యక్రమంలో తెలిపారు. ప్రతి యేటా ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులకు మూడు నెలల ముందే నిర్జల ఏకాదశి రోజు కర్రపూజ నిర్వహించి పనులను ప్రారంభిస్తారు. అదే ఆనవాయితీగా బుధవారం సాయంత్రం ఖైరతాబాద్ మహాగణపతి సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కర్రపూజతో విగ్రహ తయారీ పనులకు శ్రీకారం చుట్టారు.
69వ సంవత్సరం సందర్భంగా ఈసారి ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్‌కు అంకితమిస్తూ 61 అడుగుల మట్టి వినాయకుడిని తయారుచేయాలని నిర్ణయించినట్లు కన్వీనర్ సందీప్‌రాజ్ తెలిపారు. వారం రోజుల్లో మహాగణపతి నమూనాను విడుల చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. గత సంవత్సం లాగానే ఈ సంవత్సరం శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్, ఆర్టిస్టు జోగారావు నేతృత్వంలో మట్టి మహాగణపతి తయారు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
కర్రపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఖైరతాబాద్ మహాగణపతి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. వినాయక ఉత్సవాలకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.