Telangana Assembly Monsoon Session 2021 (Photo-Video Grab)

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఖైరతాబాద్‌, బషీర్‌బాగ్‌, రవీంద్రభారతి, మాసబ్‌ట్యాంక్‌, లక్డీకాపూల్‌, ఎంజే మార్కెట్‌, నాంపల్లిలో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని చెప్పారు.

ఈ నెల 6న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్, 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు

2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ నెల 6న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఈ నెల 3న గవర్నర్‌ తమిళిసై ప్రసంగించనున్నారు. ఉభయసభలు శుక్రవారం మధ్యా హ్నం 12.10 గంటలకు అసెంబ్లీహాల్‌లో సమావేశం కానున్నట్టు గవర్నర్‌ తమిళిసై మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. గవర్నర్‌ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? గవర్నర్‌ ప్రసంగం, బడ్జెట్‌, పద్దులపై చర్చ ఏ రోజున చేపట్టాలనే అంశాలపై బీఏసీలో నిర్ణయిస్తారు.