Telangana Minister Talasani Srinivas Yadav (photo-ANI)

Hyderabad, December 8: దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Telangana MInister Talasani Srinivas Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో హైదరాబాద్ పోలీసులు ( Hyderabad Cops) ఎప్పుడూ ప్రత్యేకమేనని అన్నారు. అంతేగాక, కేసీఆర్ (KCR) ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన నిందితులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అత్యాచారాలు చేసే వారికి కఠిన శిక్షలు ఉంటాయని, అది ఎన్ కౌంటర్ (Encounter)కూడా కావచ్చని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. వెటర్నరీ డాక్టర్ పై హత్యాచారం కేసులో నలుగురు నిందితులనూ కాల్చి చంపడంపై ఆయన స్పందించారు.

అత్యంత పాశవికంగా దారుణాలకు పాల్పడేవారికి పోలీస్ ఎన్‌కౌంటరే సరైన శిక్షని ఆయన అన్నారు. "ఇది ఓ పాఠం. మీ ప్రవర్తన బాగాలేకుంటే, మీకు కోర్టుల్లో విచారణ, జైలు శిక్ష, ఆపై బెయిలు, కేసులను సాగదీయడం ఇవేమీ ఉండవు. ఇకపై అటువంటివి జరుగవు కూడా. ఈ ఘటనతో మేము సమాజానికి ఓ స్పష్టమైన మెసేజ్‌ని పంపించాం. ఎవరైనా దారుణ నేరాలకు పాల్పడితే, వారికి ఎన్ కౌంటరే శిక్ష" అని తలసాని వ్యాఖ్యానించారు.

ANI Tweet

దిశకు న్యాయం జరగాలని దేశమంతా ఎదురు చూసిందని.. ఇందుకు తగ్గట్లుగానే నిందితుల ఎన్‌కౌంటర్‌(Hyderabad Encounter)తో తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పిందని మంత్రి తలసాని అన్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులో ఉంచాలన్నది తమ సీఎం కేసీఆర్ లక్ష్యమని తలసాని వ్యాఖ్యానించారు. అత్యాచార నిందితులపై పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్, దేశవ్యాప్తంగా పోలీసులందరికీ దిశా నిర్దేశమైందని అన్నారు. కేవలం సంక్షేమ పథకాల్లోనే కాకుండా, ఇటువంటి శిక్షల విషయంలోనూ తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ పోలీసుల సత్తా ఏంటో గతంలోనే నిరూపించుకున్నారని, ఇంతకుముందు ఉగ్రవాది అయిన వికారుద్దీన్ అతని గ్యాంగ్, నయీమ్ గ్యాంగ్ వంటి ఎన్నో కేసులను తెలంగాణ ప్రభుత్వం ఛేదించిందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి రారు.. ఆయనకు ఉగ్ర రూపం వస్తే ఏ విధంగా ఉంటుందో చాలా మందికి తెలుసు.. కొంత మంది ఏ అవకాశం వచ్చినా ఇలా దుమ్మెత్తిపోస్తుంటారని తలసాని మండిపడ్డారు.

వెటర్నరీ డాక్టర్ దిశపై (Hyderabad Vet Rape and Murder Case) అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన నిందితులను శుక్రవారం తెల్లవారుజామున సైబరాబాద్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. కేసు రీ కన్‌స్ట్రక్చన్ కోసం నిందితులను దిశను హత్య చేసిన స్థలానికి తీసుకెళ్లగా.. అక్కడ నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు.