Weather Forecast: హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో అతి భారీ వర్షాలు, ఉత్తర తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
Rains (Photo-Twitter)

IMD issues red alert for North Telangana: నేడు, రేపు తెలంగాణలో అతిభారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాల నేపథ్యంతో వాతావరణ శాఖ ఉత్తర తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.అలాగే దక్షిణ తెలంగాణకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది. 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేయడం జరిగింది. ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో నేడు అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. మంగళవారం సుమారు 20 సెంటీ మీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వచ్చే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆవర్తనం ప్రభావం కారణంగా నగరంలో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. సికింద్రాబాద్‌ దాని పరసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.6 కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23.4 గాలిలో తేమ 73 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఆసియా దేశాలను వణికిస్తున్న తాలిమ్ టైఫూన్, 20 అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్న రాకాసి అలలు, చైనా, వియాత్నం, హాంగ్‌కాంగ్ దేశాలు విలవిల

జగిత్యాల, కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, జనగాం, రంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌, సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక బుధవారం కూడా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతంలో రాగల 48 గంటల్లో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలోని ఒడిసా- పశ్చిమ బెంగాల్‌ తీరాల్లో ఉన్న ఆవర్తనం ప్రభావం వల్ల ఒడిసా- పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌ ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని వెల్లడించింది.

బంగాళాఖాతంలో 48 గంటల్లో వాయుగుండం ఏర్పడే అవకాశం, జూలై 17 నుండి 21 వరకు ఏపీలో భారీ వర్షాలు

కామారెడ్డి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డితో పాటు తాడ్వాయి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట్, బిక్కనూర్, సదాశివనగర్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు.. కొమరం భీం జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షంతో శ్రీరాంపూర్, ఇందారం, మందమర్రి, ఆర్కేపీ, ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది.