Credits: Twitter

Hyderabad, April 04: భారత వాతావరణశాఖ (IMD) తెలంగాణ రాష్ట్రానికి తీపి ముచ్చట చెప్పింది. త్వరలో వర్ష సూచన ఉన్నదని, కాస్త ఉష్ణతాపం నుంచి ఉపశమనం దొరుకుతుందని (rain forecast Telangana) తెలిపింది. రాష్ట్రంలో ఆరో తేదీ వరకు వాతావర ణం పొడిగా ఉంటుందని, 7, 8 తేదీల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ (IMD) అంచనా వేసింది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు (Rains) కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్‌లో వెల్లడించింది. కాగా, రాష్ట్రంలో ఈ వేసవిలో తొలిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత బుధవారం నమోదైంది. ఖమ్మంతోపాటు భద్రాద్రి కొత్తగూడెంలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది.

 

గురువారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎల్‌నినో పరిస్థితులు జూన్‌ చివరి వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ వేసవిలో ఎండలు ఎకువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. నిజామాబాద్‌లో 41.2, ఆదిలాబాద్‌లో 41.3, మెదక్‌, రామగుండం, నల్లగొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఎండలు, వడగాడ్పులు అధికంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాకు వచ్చింది. ముఖ్యంగా మే నెలలో అగ్నిగుండాన్ని తలపించేలా ఎండలు, వడగాడ్పులు ప్రతాపం చూపనున్నాయి. సాధారణం కంటే 5-8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని ఐఎండీ అంచనా వేస్తున్నది.