Hyderabad, AUG 03: కోమటిరెడ్డి బ్రదర్స్ (Komatireddy brothers) బ్రాందీ షాపులు పెట్టుకునే వాళ్లంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth reddy) వ్యాఖ్యానించడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని సూచించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Venkat Reddy) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్‌పై ఫైర్ అయ్యారు. ‘‘రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదు. రాజ గోపాల్ రెడ్డి తనకు ఇష్టం ఉన్న పార్టీలోకి వెళ్తారు. మేం బ్రాందీ షాపులు పెట్టుకునే వాళ్లమని మాట్లాడతారా? బ్రాండ్ కాదు.. బ్రాందీ షాపని మాట్లాడతారా? పీసీసీ చీఫ్‌గా ఉన్న వ్యక్తి అలా మాట్లాడతారా? మీరు అనే పదాన్ని వెనక్కు తీసుకోవాలి. మీరు అని కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేశారు? కోమటిరెడ్డి బ్రదర్స్ నిజాయితీగా ఉన్న వాళ్లం. రేవంత్ రెడ్డి.. నన్ను రెచ్చగొట్టొద్దు. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి. వెంటనే రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి. నేను రాజకీయాల్లోకి వచ్చే నాటికి రేవంత్ పుట్టలేదు. ఆయనపై నేనెవరికీ ఫిర్యాదు చేయను’’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.
అయితే తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటనపై మాత్రం వెంకటరెడ్డి స్పందించలేదు. తాను ఆ విషయంపై మాట్లాడనని, ఏదైనా ఉంటే రాజగోపాల్ రెడ్డినే అడగాలంటూ సమాధానమిచ్చారు. దీంతో కోమటిరెడ్డికి, రేవంత్ రెడ్డికి మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్ మరోసారి బయటపడ్డట్లైంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న విబేధాల్ని మరోసారి బహిర్గతం చేస్తోంది. మరోవైపు బీజేపీకి చెందిన నేతలు కూడా రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు.