Komatireddy Rajgopal Reddy (Photo-Twitter)

Hyd, August 3: గత కొద్దిరోజులుగా బీజేపీ ( BJP) వైపు వెళుతున్నట్లుగా సంకేతాలిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి(MLA Rajagopal Reddy) కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లో స్పీకర్‌ను కలసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు.హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా (Rajagopal Reddy quits Congress) చేస్తున్నానని బాధతో చెప్తున్నా. కాంగ్రెస్‌ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పదవిని అంటిపెట్టుకుని ప్రజల్లో తిరగలేను. నేడో, రేపో రాజీనామా చేస్తా. నా పదవీ త్యాగంతో అయినా ఈ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు కనువిప్పు కలగాలి. ప్రజాస్వామ్యంలో అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాలనే నిర్ణయానికి రావాలి. మునుగోడు అభివృద్ధి కావాలనే లక్ష్యంతో రాజీనామా చేస్తున్నా’’అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు.

తనకు సోనియా, రాహుల్‌ గాంధీ అంటే గౌరమని.. అందుకే విమర్శలు చేయడం లేదని, అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానం తీరు తనను ఎంతగానో బాధించిందని వివరించారు. ఎంతో బాధతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాల వల్ల పార్టీ బలహీన పడిందని.. అలాగే కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం కూడా బలహీనపడిందని వ్యాఖ్యానించారు. అవమానాలను భరిస్తూ కాంగ్రెస్‌లో ఉండాల్సిన అవసరం.. బయట నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డి లాంటి వారి నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం లేదన్నారు.

ఖమ్మం ఎంపీ నామా కొడుకుపై కారులో దాడి చేసిన దుండుగులు, అనంతరం రూ. 75 వేలు ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయించుకొని పరార్, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

కనీసం కమిటీల ఏర్పాటులో కూడా తమను భాగస్వాములను చేయలేదని.. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరితే అధిష్ఠానం కనీసం పిలిచి మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ కష్టకాలంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచానని.. ఎన్నికల్లో అనేక మంది అభ్యర్ధులకు ఆర్థికసాయం చేశానని చెప్పుకొచ్చారు. అలాంటిది ఇప్పుడు.. 20 ఏళ్లపాటు కాంగ్రెస్‌ను, సోనియాను తిట్టిన వ్యక్తి కింద పనిచేయాలంటున్నారని నిర్వేదంగా అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో తమకు గౌరవం లేదన్నారు.

తాను ఈ విషయంలో కొంత సమయం తీసుకుందామని అనుకున్నానని.. కానీ కొందరు గిట్టని వ్యక్తులు సోషల్‌ మీడియాలో, టీవీ ఇంటర్వ్యూలలో తన గురించి తప్పుగా మాట్లాడుతుంటే.. ఆ దుష్ప్రచారాన్ని ఆపేందుకే ప్రకటన చేస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, మంత్రులు, ఎమ్మెల్యేలకు గౌరవం లేదని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. భవిష్యత్తులో శ్రీలంక మాదిరిగా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు. రాష్ట్రంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లకు తప్పితే ఏ నియోజకవర్గానికీ నిధులు ఇవ్వడం లేదు. కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ చుట్టూ అమెరికాలో ఉన్నట్టు రోడ్లు ఉన్నాయి. కానీ రోజూ వేల మంది తిరిగే చౌటుప్పల్‌–నారాయణపురం రోడ్డు మాత్రం గుంతలమయమైంది. ఏ అభివృద్ధీ చేయలేని ఈ ఎమ్మెల్యే పదవిని అంటిపెట్టుకుని ఉండటం దేనికని రాజీనామా చేస్తున్నా..’’అని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

సర్పంచ్‌ పదవి నుంచి సస్పెండ్‌ చేశాడనే కక్ష, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై హత్యాయత్నం, నిందితుడిని అరెస్ట చేసిన పోలీసులు 

20 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌ను, సోనియా గాంధీని తిట్టిన వారిని తీసుకొచ్చి వాళ్ల కింద మమ్మల్ని పనిచేయాలంటున్నారు. మాకు ఆత్మగౌరవం లేదా? ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి పెద్దపీట వేయడమేకాదు.. వాళ్లే ప్రభుత్వం తీసుకువస్తారని మాట్లాడుతారా? పదవులు ఇవ్వకపోయినా కనీసం చర్చించి నిర్ణయాలు తీసుకోరా? కాంగ్రెస్‌ మీ కంట్రోల్‌లో ఉండాలా? ఏం తప్పు చేశామని మాపై చర్యలు తీసుకుంటారు? తెలంగాణ ఇచ్చికూడా తప్పులు చేసి మూర్ఖంగా పార్టీని నాశనం చేశారు. దీనివల్ల కాంగ్రెస్‌ కార్యకర్తలు నష్టపోయారు’’అని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి అవుతుందంటే పదవీ త్యాగం చేస్తానని ఎప్పుడో చెప్పానని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో దళిత బంధు ఇచ్చినప్పుడే.. మునుగోడు దళితుల కోసం రూ.2 వేల కోట్లు ఇస్తే పదవీత్యాగం చేసి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తానన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం నిధులివ్వక మునుగోడును ఆశించినంత అభివృద్ధి చేయలేకపోయానని వాపోయారు. ఉప ఎన్నికలు వచ్చినచోట ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఆశ కలిగిందని.. అందుకే తన రాజీనామాతోనైనా మునుగోడు అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ చాలా ఘోరంగా ఉందని.. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యమే లేదని రాజగోపాల్‌ రెడ్డి విమర్శించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనూ శ్రీలంక తరహా పరిస్థితులు వస్తాయని ఆయన హెచ్చరించారు. 1400 మంది బలిదానాలతో తెలంగాణ వస్తే.. ఇప్పుడది కేసీఆర్‌ కుటుంబ పాలన కోసమే ఉపయోగపడుతోందని, దేశంలో ఇంతటి ఘోరమైన పాలన ఏ రాష్ట్రంలోనూ లేదని మండిపడ్డారు. కేసీఆర్‌ పాలన నయా నవాబులా ఉందని నిప్పులు చెరిగారు. కొద్దిమందే సంపదను అనుభవిస్తున్నారని, పార్టీలు మారిన వారికి దోచిపెడుతున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే మోదీ, అమిత్‌షాల నాయకత్వంలోని బీజేపీతోనే సాధ్యమని.. తాను వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘కోమటిరెడ్డి బ్రదర్స్‌ ప్రజల కోసం బతుకుతారు. డబ్బులకు అమ్ముడుపోయే వాళ్లు కాదు. అవకాశవాద రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. రాజకీయాలను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించుకోలేదు. నా రాజకీయ జీవితానికి, వ్యాపారాలకు సంబంధం లేదు.నా కుమారుడే అన్ని వ్యాపారాలు చూసుకుంటున్నాడు. మునుగోడు ప్రజలు అర్థం చేసుకుంటారు. నా నిర్ణయం తప్పయితే క్షమించండి. సరైనదే అనుకుంటే నాతో రండి’’అని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీలో ఎప్పుడు, ఎవరి సమక్షంలో చేరాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేదన్నారు. తన సోదరుడు వెంకటరెడ్డి ఏం చేస్తారనేది ఆయననే అడగాలని ఓ ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు.